Begin typing your search above and press return to search.

మ‌హేష్ బాబుతో `అల్లూరి సీతారామ‌రాజు` రీమేక్‌?

By:  Tupaki Desk   |   1 Feb 2022 8:00 AM IST
మ‌హేష్ బాబుతో `అల్లూరి సీతారామ‌రాజు` రీమేక్‌?
X
తాను హీరోగా మార‌డానికి `అల్లూరి సీతారామరాజు` కార‌ణ‌మ‌ని, త‌న తండ్రే త‌న‌కు ఈ విష‌యంలో స్ఫూర్తిగా రిలిచారని గ‌తంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు సూప‌ర్ స్టార్ మ‌హేష్. అయితే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో త‌న‌కు హీరో గా స్ఫూర్తి నిచ్చిన `అల్లూరి సీతారామ‌రాజు` పాత్ర‌లో న‌టించ‌డానికి మ‌హేష్ బాబు రెడీ అవుతున్నారా? అంటే టాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి.

సూప‌ర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో `అల్లూరి సీతారామ‌రాజు`కు ప్ర‌త్యేక‌త వుంది. ఆయ‌న సినిమాల్లో ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ చెప్పుకోద‌గ్గ సినిమాగా ఈ చిత్రానికి ప‌త్యేక స్థానం వుంది. 1970 మే 1న విడుద‌లై ఈ చిత్రం అల్లూరి సీతారామరాజు జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కింది. వి. రామ‌చంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ప‌లు రికార్డుల్ని న‌మోదు చేసింది. ద‌క్షిణాదిలో తొలి సినిమా స్కోప్ మూవీగా రికార్డుని నెల‌కొల్పింది. ముందు ఈ సినిమాని శోభ‌న్ బాబుతో చేయాల‌ని నిర్మాత డి.ఎల్ . నారాయ‌ణ స్టోరీని సిద్ధం చేయించారు. కానీ సెట్స్ పైకి రాకుండానే మ‌ధ్య లో ఈ మూవీ ఆగిపోవ‌డంతో ఆ క‌థ‌ని సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు అప్ప‌గించార‌ట‌.

ప‌ద్మాల‌య స్టూడియోస్ వంటి సొంత నిర్మాణ సంస్థ వుండ‌టంతో దీన్ని కృష్ణ ఎలాగైనా తెర‌పైకి తీసుకొస్తార‌ని భావించిన డి.ఎల్‌. నారాయ‌ణ అల్లూరి క‌థ‌ని కృష్ణ‌కు అప్ప‌గించార‌ట‌. అలా శోభ‌న్ బాబు చేయాల్సిన `అల్లూరి సీతారామ‌రాజు` చిత్రాన్ని కృష్ణ చేశారు. ఈ సినిమా కోసం శ్రీ‌శ్రీ రాసిన `తెలుగు వీర లేవ‌రా..` పాట‌కు నేష‌న‌ల్ అవార్డు ద‌క్కింది. అంతే కాకుండా అప్ప‌టి వ‌ర‌కు వున్న చిత్రాల్లో హ‌య్యెస్ట్ గ్రాస‌ర్ గా ఈ మూవీ నిలిచింది. చాలా వ‌ర‌కు అవుట్ డోర్ లో చిత్రీక‌రించిన స‌న్నివేశాల కోసం హీరో కృష్ణ చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ట‌.

ఇలా చాలా ప్ర‌త్యేక‌త‌ల‌తో రూపొంది, కృష్ణ కెరీర్ లోనూ మ‌ర‌పురాని చిత్రంగా నిలిచిన ఈ సినిమాని రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న‌లో మ‌హేష్ బాబు వున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. `బాహుబ‌లి` త‌రువాత మ‌న సినిమా స్థాయి, మార్కెట్ పెర‌గ‌డంతో ప్ర‌స్తుతం అంతా పాన్ ఇండియా స్థాయి చిత్రాల కోసం ఎదురుచూస్తున్న నేప‌థ్యంలో తాను హీరోగా మార‌డానికి స్ఫూర్తిగా నిలిచిన సినిమాని రీమేక్ చేయాల‌ని మ‌హేష్ భావిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ లో ప్ర‌భాస్‌, అల్లు అర్జున్ ఇప్ప‌టికే పాన్ ఇండియా స్టార్ లు గా మారిపోయారు. `లైగ‌ర్‌`తో విజ‌య్ దేవ‌ర‌కొండ పాన్ ఇండియా స్థాయి హీరోగా మార‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలో `అల్లూరి సీతారామ‌రాజు` రీమేక్ తో పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకోవాల‌ని మ‌హేష్ భారీ ఆలోచ‌న‌తో వున్న‌ట్టుగా చెబుతున్నారు. తండ్రి కృష్ణ‌కు జీవిత‌కాలం గుర్తుండిపోయే సినిమాగా నిలిచిన `అల్లూరి సీతారామ‌రాజు` ని రీమేక్ చేసి ఆ మ్యాజిక్ మ‌రోసారి రిపీట్ చేయాల‌ని భావిస్తున్నార‌ట. దీన్ని రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తారా? లేక మ‌రో డైరెక్ట‌ర్ తో వెళ‌తారా అన్న‌ది తెలియాల్సి వుంది.