Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీ కొత్త పాఠం నేర్చుకుంది: అల్లు అరవింద్

By:  Tupaki Desk   |   4 Jun 2022 3:29 AM GMT
ఇండస్ట్రీ కొత్త పాఠం నేర్చుకుంది: అల్లు అరవింద్
X
గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన 'పక్కా కమర్షియల్' సినిమాకి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు. నిన్న జరిగిన ఈ సినిమా ప్రెస్ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "ఈ సినిమా కథను మారుతి వినిపించగానే, టైటిల్ ఏది అనుకుంటున్నావ్? అని అడిగితే 'పక్కా కమర్షియలేయ్' అన్నాడు. మారుతి దగ్గరున్న ప్రత్యేకతనే అది. ఈ సినిమాతో రెండున్నర గంటల పాటు నవ్విస్తూనే .. ఒక మెసేజ్ ఇచ్చి హాయిగా బయటికి పంపిస్తాడు. ఎప్పుడైనా సరే మారుతి సినిమాను థియేటర్లోనే చూడాలి .. అప్పుడే బాగా ఎంజాయ్ చేయగలుగుతాము.

కొన్ని సినిమాలను థియేటర్లలోనే చూడాలి .. 'ఎఫ్ 3' సినిమాను కూడా థియేటర్ కి వెళ్లి చూడమని నేను బన్నీతో చెప్పాను. 'పక్కా కమర్షియల్' కూడా అలాంటిదే. ఈ సినిమా ఓటీటీలో రావడానికి చాలా సమయం పడుతుంది.

ఓటీటీకి వెంటనే సినిమాలు తీసుకుని రావడం వలన ఇండస్ట్రీ అయిపోతుందనే విషయం అర్థమైంది. ఇండస్ట్రీ ఈ మధ్య నేర్చుకున్న పాఠం ఏమిటంటే టికెట్ల రేటు తగ్గించండి .. ఓటీటీలకు కాస్త దూరం పెట్టండి అనే. గోపీచంద్ గారి ఫాదర్ ఎంత గొప్ప దర్శకుడనేది చాలామందికి తెలుసు. ఆయనతో సినిమా చేయాలనుకుంటే కుదరలేదు. గోపీచంద్ గారితో సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది.

గోపీచంద్ కి యాక్షన్ మాత్రమే కాదు .. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంది. అందువల్లనే మారుతి ఆయనతో ఈ సినిమా చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ రాశి ఖన్నా అని నేను మారుతి కంటే ఎక్కువ ఫిక్స్ అయ్యాను. ఆమె పాత్ర అంత యెటకారంగా .. వేళాకోళంగా ఉంటుంది. ఆ పాత్రను ఆమె అద్భుతంగా చేస్తుందని నాకు తెలుసు. మారుతికి .. మాకు మధ్య మంచి అనుబంధం ఉంది. మా బ్యానర్లో చేయడం ఆయనకి ఒక సెంటిమెంట్ గా మారిపోయింది. మారుతి ఈ సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టించాడు. లాభం రాకపోతే తరువాత సినిమా రెమ్యునరేషన్ లో కోత ఉంటుంది.

ఈ స్టేజ్ పైనే అంతా మాట్లడేస్తున్నారు .. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లేదా అని అనుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇంకా నాలుగు ఫంక్షన్లు ఉన్నాయి. ఈ నాలుగు ఫంక్షన్లలో ఏమేం మాట్లాడాలో డిసైడ్ అయ్యాను.

గోపీచంద్ కి ఇలాంటి ఫంక్షన్లకు రావడం అలవాటు లేదు .. ఇష్టం లేదు .. సిగ్గు. ఈ సారి గోపీచంద్ ను రప్పించాలనే అనుకున్నాము. ఈ మధ్య ఒక పెద్ద హీరో స్టేజ్ పైకి వెళ్లి డాన్స్ చేసి సినిమాను ప్రమోట్ చేశారు .. అలా చేయవలసిన అవసరం ఉంది. హీరో హీరోయిన్లు ఎలాంటి ఫంక్షన్లు ఉన్నా వచ్చి సినిమాను ప్రమోట్ చేసుకోవాలి .. ఎందుకంటే ఇది మీ సినిమా" అంటూ చెప్పుకొచ్చారు.