Begin typing your search above and press return to search.

సినిమా రిలీజవుతోంది.. శిరీష్ ఎక్కడ?

By:  Tupaki Desk   |   27 Jun 2018 9:58 AM GMT
సినిమా రిలీజవుతోంది.. శిరీష్ ఎక్కడ?
X
పోయినేడాది మలయాళంలో ‘1971 బియాండ్ బార్డర్’ అనే మలయాళ సినిమా రిలీజైనపుడు అల్లు శిరీష్ ఎంత హడావుడి చేశాడో గుర్తుండే ఉంటుంది. కేరళకు వెళ్లి ఆ చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్నాడు. సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశాడు. మోహన్ లాల్ లాంటి గొప్ప నటుడితో కలిసి సినిమా చేసినందుకు చాలా ప్రౌడ్ గా ఫీలవుతున్నట్లు చెప్పాడు. ఈ సినిమాను వార్తల్లో నిలబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఇప్పుడు అదే సినిమా తెలుగు వెర్షన్ ‘యుద్ధభూమి’ తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారమే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. కానీ దీని గురించి ఇక్కడ మాట్లాడేవాళ్లే కరవయ్యారు.

శిరీష్ అయితే దీని విడుదల సంగతే పట్టించుకోవట్లేదు. సినిమాను అస్సలు ప్రమోట్ చేయట్లేదు. ఒక్క ట్వీట్ అయినా చేయట్లేదు. మెగా ఫ్యామిలీ వాళ్లు కానీ.. అభిమానులు కానీ అస్సలు ఈ సినిమాపై ఫోకస్ పెట్టట్లేదు. ఇంతకుముందు శిరీష్ తొలి సినిమా ‘గౌరవం’ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆ సినిమా ఆడుతుందన్న నమ్మకాలు లేకపోయాయి. దాని వల్ల శిరీష్‌ కు కలిగే మేలేమీ లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆ సినిమాను వదిలేశారు. ‘యుద్ధభూమి’ విషయంలోనూ అదే అంచనాలతో ఉన్నట్లున్నారు. మోహన్ లాల్ హీరో కావడంతో మలయాళంలో మంచి అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం తుస్సుమనిపించింది. అల్లు శిరీష్ నటన గురించి కూడా కేరళలో పెద్ద చర్చ నడవలేదు. ఈ చిత్ర సమీక్షల్లో కూడా అతడి ప్రస్తావన పెద్దగా లేదు. ఈ చిత్రం తెలుగులోనూ ఆడే అవకాశాలు లేకపోవడం.. శిరీష్ గురించి డిస్కషన్ వచ్చే అవకాశం లేకపోవడంతో దీన్ని అలా వదిలేసినట్లు కనిపిస్తోంది.