Begin typing your search above and press return to search.

అల్లువారబ్బాయి కెరీర్ గాడిలో పడేనా..??

By:  Tupaki Desk   |   14 Jun 2022 3:29 AM GMT
అల్లువారబ్బాయి కెరీర్ గాడిలో పడేనా..??
X
టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకూ అందరూ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. పాండమిక్ కారణంగా కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నవారంతా.. ఎన్నడూ లేని విధంగా కొత్త చిత్రాలకు సైన్ చేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో మూవీ షూటింగును మొదలు పెడుతున్నారు. ఇండస్ట్రీలో అందరిలో నూతనోత్సాహం కనిపిస్తుంటే యంగ్ హీరో అల్లు శిరీష్ మాత్రం తన లైనప్ గురించి ఎలాంటి హింటూ ఇవ్వడం లేదు.

లెజండరీ నటుడు అల్లు రామలింగయ్య మానవుడిగా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా, స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు శిరీష్. మెగా ఫ్యామిలీ అండతో వచ్చినప్పటికీ.. తొలి సినిమా 'గౌరవం' ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ఈ క్రమంలో వచ్చిన సినిమాల్లో 'శ్రీరస్తు శుభమస్తు' మాత్రమే సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకొని చేసిన 'ఏబీసీడీ' సినిమా కూడా ప్లాప్ అయింది. ఇలా దశాబ్దం క్రితమే కెరీర్ స్టార్ట్ చేసినా ఇంతవరకు శిరీష్ హీరోగా నిలబడలేకపోయాడు.

మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలామంది ఇప్పుడు సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్నారు. స్టార్ హీరోలను పక్కన పెడితే వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ లు టైర్-2 హీరోలలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది లాంచ్ చేయబడిన పంజా వైష్ణవ్ తేజ్ కూడా డెబ్యూ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకొని.. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నాడు. కానీ శిరీష్ కెరీర్ మాత్రం ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదనిపిస్తోంది.

సాధారణంగా పెద్ద ఫ్యామిలీల నుంచి ఇండస్ట్రీకి వచ్చే హీరోలకు ఆఫర్స్ విషయంలో డోకా ఉండదు. పేరున్న దర్శకులతో బడా బ్యానర్లు సినిమాలు నిర్మించడానికి రెడీగా ఉంటాయి.. లేకపోతే హోమ్ ప్రొడక్షన్ లో అయినా మంచి ప్రాజెక్ట్స్ సెట్ చేస్తుంటారు. కానీ అల్లు అరవింద్ వంటి స్టార్ ప్రొడ్యూసర్ కొడుకైనప్పటికీ.. ఒక్కసారి శిరీష్ సినిమాలు గమనిస్తే, మొదట్నుంచీ అతని కెరీర్ ను గాడిలో పెట్టడానికి జాగ్రత్తలు తీసుకోలేదేమో జరగలేదేమో అనిపిస్తుంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ హీరోగా ''ప్రేమ కాదంట'' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు 'జత కలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. వినూత్న‌మైన కథా కథనాలతో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను గతేడాదే వదిలారు. అను ఇమ్మాన్యుయేల్‌ తో అల్లువారబ్బాయి లిప్ లాక్ సీన్స్ కొన్నాళ్లపాటు అందరూ చర్చించుకునేలా చేసింది. అయితే ఆ తర్వాత సినిమా నుంచి మరో అప్డేట్ లేదు.

కరోనా పాండమిక్ తర్వాత పరిశ్రమ నార్మల్ అవడంతో ఎప్పటిలాగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ అల్లు శిరీష్ సినిమా ఎక్కడి దాకా వచ్చింది.. ఏ స్టేజీలో ఉంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. దీంతో ''ప్రేమ కాదంట'' చిత్రంపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలో ఏదొక అప్డేట్ వదిలి వాటికి చెక్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న అన్న బన్నీ మాదిరిగానే.. అల్లు శిరీష్ కూడా నిలదొక్కుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. శిరీష్ క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకోకపోవడానికి కారణం తన సొంత కష్టంతో పేరు తెచ్చుకోవాలని ఫిక్స్ అవ్వడమే అని అంటున్నారు.

అందుకే శిరీష్ కమర్షియల్ సినిమాల వైపు పరుగులు తీయకుండా.. కంటెంట్ ను నమ్ముకొని ముందుకు వెళ్తున్నాడని చెబుతున్నారు. 'విలాయతి శరాబ్‌' అనే హిందీ మ్యూజిక్ ఆల్బమ్ తో నేషనల్ వైడ్ పాపులర్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. త్వరలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఇండస్ట్రీలో నిలబడతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు.