Begin typing your search above and press return to search.

న‌టుడ‌వ్వ‌డానికి బియ్యం లంచ‌మిచ్చాడు!

By:  Tupaki Desk   |   2 Oct 2022 7:30 AM GMT
న‌టుడ‌వ్వ‌డానికి బియ్యం లంచ‌మిచ్చాడు!
X
న‌టులు అవ్వాలంటే మేనేజ‌ర్ల‌కు స‌మ‌ర్పించుకోవాలి. పారితోషికం నుంచి ప‌ర్సంటేజీలు గుంజేస్తుంటార‌ని మ‌హిళా న‌టీమ‌ణుల విష‌యంలో అస‌భ్యంగా ప్ర‌వర్తిస్తార‌ని క‌థ‌నాలు పుంఖానుపుంఖాలుగా వెలువ‌డ్డాయి.

అయితే ఆయ‌న తీరే వేరు. ఆయ‌న బియ్యం లంచ‌మిచ్చి నాట‌కాల్లో వేషాలు వేసేవార‌ట‌. నాట‌కాల‌కు న‌టుల‌ను ఎంపిక చేసే మేనేజ‌ర్ కి బియ్యం తీసుకెళ్లి సంచుల‌తో అందించేవార‌ట‌. అలా త‌న‌కు నాట‌కాలు న‌ట‌న‌పై ఉన్న పిచ్చిని వ‌దులుకోకుండా చివ‌రికి న‌టుడ‌య్యారు. త‌ర్వాత సినిమాల్లో రాణించారు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో చెప్పాల్సిన ప‌ని లేదు.. ది గ్రేట్ అల్లు రామ‌లింగ‌య్య‌. వంద‌లాది చిత్రాల్లో త‌న‌దైన విల‌క్ష‌ణ న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసిన మేటి ఆర్టిస్టు. మెగాస్టార్ చిరంజీవి మామ‌గా ప‌రిశ్ర‌మ‌లో సుప్ర‌సిద్ధులు.

ఇప్పుడు అల్లు రామ‌లింగ‌య్య శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో చిరంజీవి త‌న మామ గారి గురించి చెప్పిన సంగ‌తులు అంద‌రినీ ఆశ్చర్య‌ప‌రిచాయి. అల్లు రామ‌లింగ‌య్య గారి క్ర‌మ‌శిక్ష‌ణ ఆద‌ర్శ ల‌క్ష‌ణాల గురించి చిరు ఎంతో ఎమోష‌న‌ల్ గా ఈ వేదిక‌పై వెల్ల‌డించారు. ఆయ‌న నిరంత‌రం విద్యార్థి. ప్ర‌తిక్ష‌ణం ఏదైనా సాధించాలి అనే ప‌ట్టుద‌ల‌తో ఉండేవారు. ఓ వైపు న‌టుడిగా బిజీగా ఉన్నా కానీ మ‌రోవైపు స్టడీని కొన‌సాగించారు. నడి వ‌య‌సులో ఆర్.ఎం.పి డాక్ట‌ర్ అయ్యారు.

నేను ఆర్టిస్టుగా సెటిల‌య్యాక మ‌రో వ్యాపారం వైపు వెళ్ల‌లేను. రాజ‌కీయాలు ఏదో అలా ట్రై చేసానంతే.. కానీ ఆయ‌న‌లా నేను చేయ‌లేను అని చిరు అన్నారు. ఆరోజుల్లోనే ఆర్.ఎంపి ప్రాక్టీస్ చేసి ఫిలింఇండ‌స్ట్రీలో అంద‌రికీ డాక్ట‌ర్ అయ్యారు రామ‌లింగ‌య్య గారు. ఆర్టిస్టుల‌ నాలుక‌పై ఆయ‌న మందులు వేసేవారు . ప‌రిశ్ర‌మ‌లో అంద‌రికీ ఆయ‌న త‌ల‌లో నాలుక అయ్యాడు. ఆయ‌న‌తో కూచుంటే చాలు డాక్ట‌ర్ గా మాకు ఎన్నో నేర్పించారు. ఇప్ప‌టికీ మా ఇంట్లో ఆ వైద్యం కొన‌సాగుతూనే ఉంది. రామారావు- నాగేశ్వ‌ర‌రావు- కృష్ణ గారికి కోట శ్రీ‌నివాస‌రావు గారికి అంద‌రికీ మందులు ఇచ్చి రోగం త‌గ్గించిన డాక్ట‌ర్ ఆయ‌న‌. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఆద‌ర్శాలు ఉన్నాయి.

వీటితో పాటు ఆయ‌న ఎన్నో ఫిలాస‌ఫిక‌ల్ విష‌యాలు నేర్పారు. గాంధేయ‌వాది. వివేకానంద .. రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస వంటి వారి గురించి ఎన్నో నేర్పించేవారు. ప్ర‌జానాట్య‌మండ‌లి క‌ళాకారుడిగా ఆయ‌న‌లో విప్ల‌వం దాగి ఉంది. ఇక నాతో ఎంతో స‌న్నిహితుడిగా ఒక స్నేహితుడిగా ఆయ‌న మెలిగిన తీరు ఎంతో గొప్ప‌గా ఉండేది.. అంటూ చిరు నాటి సంగ‌తుల‌ను గుర్తు చేసుకున్నారు. శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో అల్లు రామ‌లింగ‌య్య‌కు నివాళులు అర్పించారు.