Begin typing your search above and press return to search.

మామ త‌ర‌ఫున ప్ర‌చారానికి నో అంటున్న బ‌న్నీ!

By:  Tupaki Desk   |   30 Oct 2018 7:12 AM GMT
మామ త‌ర‌ఫున ప్ర‌చారానికి నో అంటున్న బ‌న్నీ!
X
తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టీడీపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తారంటూ ప్ర‌స్తుతం జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బ‌న్నీ మామ‌-ప్ర‌ముఖ విద్యావేత్త కంచ‌ర్ల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఇబ్ర‌హీంప‌ట్నం నుంచి ఆ పార్టీ త‌ర‌ఫున బ‌రిలో దిగే అవ‌కాశాలుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. మామ త‌ర‌ఫున ప్ర‌చారానికి ఇప్ప‌టికే సై అన్నాడ‌ని కూడా ప‌లువురు చెబుతున్నారు. అయితే, ఈ వార్త‌ల‌న్నీ ఊహాగానాలేన‌ని తెలుస్తోంది. చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి బ‌రిలో దిగినా టీడీపీ త‌ర‌ఫున బ‌న్నీ ప్ర‌చారాన్ని త‌న భుజాల‌పై వేసుకోబోర‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందుతోంది.

బ‌న్నీ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి తండ్రి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న టీఆర్ ఎస్ త‌ర‌ఫున ఇబ్ర‌హీంప‌ట్నం స్థానం నుంచి బ‌రిలో దిగారు. అప్ప‌ట్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి చేతిలో చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఓట‌మి పాల‌య్యారు. అనంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో కిష‌న్ రెడ్డి టీఆర్ ఎస్‌ లో చేరారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న‌కే టీఆర్ ఎస్ ఈ ద‌ఫా కూడా సీటు ఖాయం చేసింది. టీఆర్ ఎస్‌ లో త‌న‌కు టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి తీవ్రంగా నొచ్చుకున్నారు. ఈ సారి కూడా ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌స్తుతం కిష‌న్ రెడ్డిపై ఇబ్ర‌హీప‌ట్నంలో చాలా వ్య‌తిరేక‌త ఉంద‌ని ఆయ‌న విశ్వ‌సిస్తున్నారు. కాబట్టి టీడీపీలోకి వెళ్లి.. ఆ పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇప్ప‌టికే అందుకు అనుగుణంగా పావులు క‌దుపుతున్నారు. ప్ర‌స్తుతం టీడీపీ మ‌హాకూట‌మిలో భాగంగా ఉండ‌టంతో.. ఆ సీటు త‌న‌కే ద‌క్కేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. టికెట్ ల‌భిస్తే త‌న త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు బ‌న్నీని ఆయ‌న ఇప్ప‌టికే ఒప్పించార‌న్న‌ది ప్ర్తస్తుతం ప్ర‌ముఖంగా వినిపిస్తున్న వాద‌న‌.

అయితే, మామ త‌ర‌ఫున ప్ర‌చారానికి బ‌న్నీ పూర్తి విముఖంగా ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. ఈ విముఖ‌త‌కు ఆయ‌న వ‌ద్ద త‌గిన కార‌ణాలు కూడా ఉన్నాయి. అందులో ప్ర‌ధాన‌మైన‌ది.. మెగా ఫ్యామిలీలో చిచ్చు రేగే అవ‌కాశం. ప్ర‌స్తుతం మెగా బ్ర‌ద‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీని స్థాపించి క్రియాశీల రాజ‌కీయాల్లో ఉన్నారు. ఆయ‌న ఏపీలో టీడీపీకి వ్య‌తిరేకంగా దూసుకెళ్తున్నారు. త‌మ్ముడికి అడ్డు కాకూడ‌ద‌న్న ఉద్దేశంతో చిరంజీవి కూడా కొంత‌కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌ లో త‌న స‌భ్య‌త్వ కాల‌ప‌రిమితి ముగిసినా కూడా పున‌రుద్ధ‌రించుకోలేదు ఆయ‌న‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో టీడీపీ త‌ర‌ఫున బ‌న్నీ వ‌కాల్తా పుచ్చుకుంటే మెగా ఫ్యామిలీ డిస్ట‌ర్బ్ అయ్యే అవ‌కాశ‌ముంది. ప‌వ‌న్‌ కు అత‌డి ప్రచారం ఇబ్బందిగా మారే ఛాన్సుంది. బ‌న్నీ ప్రచారం సాగిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్‌ కి - త‌న ఫ్యాన్స్‌ కి మ‌ధ్య గొడ‌వ‌లు కూడా రావొచ్చు. ఫ‌లితంగా కెరీర్ దెబ్బ‌తినే ముప్పు కూడా ఉంది. ఈ ప‌రిణామాల‌న్నింటినీ దృష్టిలో పెట్టుకొని మామ త‌ర‌ఫున ప్ర‌చారానికి బ‌న్నీ పూర్తి విముఖ‌త చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది.