Begin typing your search above and press return to search.

గుమ్మ‌డి కాయ‌తో దిష్టి తీశారు.. హార‌తితో స్వాగ‌తం పలికారు.. బన్నీ ఫిదా..!

By:  Tupaki Desk   |   20 Jan 2021 7:00 AM GMT
గుమ్మ‌డి కాయ‌తో దిష్టి తీశారు.. హార‌తితో స్వాగ‌తం పలికారు.. బన్నీ ఫిదా..!
X
సినిమా స్టార్ల‌కు ప్రజల ఆద‌రాభిమానాలు చూర‌గొన‌డం క‌న్నా విలువైన‌ది ఏముంటుంది? అయితే.. త‌మ అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి ఫ్యాన్స్ కు.. చూడ‌టానికి న‌టుల‌కు అవ‌కాశాలు అరుదుగా వ‌స్తుంటాయి. అలాంటి అవ‌కాశాల మ‌ధ్య‌కు వెళ్లాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. ఇంకేముంది? ఆయ‌న్ను చూసి ఫ్యాన్స్ సంబ‌రాలు చేస్తుంటే.. వారి అభిమానానికి ఫిదా అయిపోతున్నాడు బ‌న్నీ.

బన్నీ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’. సుకుమార్ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూట్లో భాగంగా అటవీ ప్రాంతాల్లో షెడ్యూల్ ప్లాన్ చేశాడు దర్శకుడు. దీనికోసం ఇటీవలే అడవికి బయలుదేరింది యూనిట్. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో షెడ్యూల్ రంపచోడవరం, వై.రామవరం మండలాల పరిధిలోని తాళ్లపాలెం, కోట, పాముబొక్క తదితర గ్రామాల సరిహద్దుల్లో షూటింగ్ జరుగుతోంది.

ఈ చిత్రీకరణ కోసం అల్లు అర్జున్ ప్రతిరోజూ రంపచోడవరం నుంచి పందిరిమామిడి మీదుగాా కోట గ్రామానికి వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక గిరిజనులు బన్నీని చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ.. కుదరట్లేదు. ఇలాగైతే పని కాదంటూ సంక్రాంతి రోజున షూట్ ముగించుకొని సాయంత్రం తిరుగుప్రయాణమైన బన్నీ వాహనాన్ని వాడపల్లి సమీపంలో దాదాపు 500 మంది గిరిజనులు ఆపేశారు.

‘మేం మీ అభిమానులం.. మిమ్మల్ని చూడాల. షూటింగు దగ్గరికొస్తే పొమ్మంటున్నారు’ అన్నారు గిరిజనులు. వారి అభిమానానికి అల్లు అర్జున్ పొంగిపోయారు. వాహనం పైకి వచ్చి వారితో మాట్లాడారు. సెల్ఫీలు కూడా దిగారు. తాజాగా.. సోమవారం రాత్రి తాళ్లపాలెం వాసులు కూడా బన్నీని ఆగాలని కోరడంతో వారితో కాసేపు గడిపాడు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.

తాజాగా.. మంగ‌ళ‌వారం కూడా గిరిజ‌నులు బ‌న్నీపై త‌మ ప్రేమ‌ను చాటుకున్నారు. కర్పూరంతో హార‌తి ఇచ్చి, స్వాగ‌తం ప‌లికిన స్థానికులు.. గుమ్మడికాయలతో దిష్టి తీశారు. బ‌న్నీ.. బ‌న్నీ.. అంటూ అరిచారు. కారు టాప్ పైకి ఎక్కిన స్టైలిష్ స్టార్‌.. వారి అభిమానానికి మంత్ర‌ముగ్ధుడై.. అలా చూస్తూ ఉండిపోయాడు. ఒక స్టార్ కు ఇంత‌కు మించి కావాల్సిందేముంది చెప్పండి? కాగా.. అడవుల్లో షూటింగ్ అంటేనే రిస్క్. అలాంటిది.. వణికిస్తున్న చలి, దట్టమైన పొగమంచు కారణంగా.. షూటింగ్ చేయడం మరింత కష్టంగా మారిందట యూనిట్ కు. మరి, అనుకున్న సమయానికే ఈ షెడ్యూల్ పూర్తవుతుందా? లేక ప్రొలాంగ్ అవుతుందా? అన్నది చూడాలి.