Begin typing your search above and press return to search.

స్టైలీష్ స్టార్ రూటే వేరు

By:  Tupaki Desk   |   26 Dec 2020 3:30 PM IST
స్టైలీష్ స్టార్ రూటే వేరు
X
స్టైలీష్ స్టార్ అంటే ఎవరనేది తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఎందుకంటే అదే ఆయన ఇంటిపేరులా మారిపోయింది. అల్లు అర్జున్ ను ఫస్ట్ టైమ్ తెరపై చూసినవాళ్లు, అవకాశం ఉంది గనుక హీరోగా ట్రై చేశాడని అనుకున్నారు. టాలెంట్ ఉన్నవారే ఇండస్ట్రీలో నిలబడతారని చెప్పుకున్నారు. బన్నీ ఆ విమర్శలను వింటూ కూర్చోలేదు. ఒక గోల్ పెట్టుకుని దానిని సాధించడం కోసమే తాను రంగంలోకి దిగాననే విషయాన్ని, ఆ విమర్శలు చేసినవారికి అర్థమయ్యేలా చేయడానికి ఆయనకు ఎక్కువ సమయం పట్టలేదు.

జుట్టు ఉంటే ఎన్నిముడులైనా వెయ్యొచ్చునన్నట్టుగా, కథ ఉంటేనే హీరో ఎన్ని వేషాలు వేసినా చెల్లుతుందనే విషయం బన్నీకి అర్థమైంది. పైగా ఒక నిర్మాతగా కథకి తన తండ్రి ఎంతటి ప్రాధాన్యతను ఇస్తాడనేది ఆయన దగ్గర నుంచి చూశాడు. అందువలన బన్నీ కథ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. కథ విషయంలో పూర్తిస్థాయి కసరత్తు జరగనిదే ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రాదు. కథ .. పాత్రలు .. మలుపులు .. పాటలు .. ఇలా అన్ని అంశాలపై పూర్తి క్లారిటీ వచ్చిన తరువాతనే బన్నీ రంగంలోకి దిగుతాడు.

తొలినాళ్లలో డాన్సులు అదరగొట్టేస్తున్నాడని అనిపించుకున్న బన్నీ, ఆ తరువాత ఫైట్లపై పూర్తి దృష్టిపెట్టాడు. యాక్షన్ సీన్స్ లోను చితగ్గొట్టేస్తున్నాడని అనిపించుకున్న తరువాతే, ఎమోషన్స్ ను పండించడంలో రాణించాడు. ముఖ్యంగా బన్నీ, కథ వేగంగా పరిగెత్తాలి .. కథను పరిగెత్తించే హీరో తెరపై ఎప్పుడూ యాక్టివ్ గా ఉండాలనే కాన్సెప్ట్ ను ఫాలో అవుతూ వచ్చాడు. అలాగే కథ ఏదైనా తన పాత్రలో కామెడీ కలిసి ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. ఒక సినిమా చేస్తూనే, ఆ తరువాత రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టేంత ముందుచూపుతో ఆయన వ్యవహరిస్తాడు.

ఇక సినిమాకి .. సినిమాకి తన లుక్ మార్చుకోవడం బన్నీ ప్రత్యేకత. ఎప్పుడూ ఒకేలా స్క్రీన్ పై కనిపించడం ఆయనకి ఇష్టం ఉండదు. పాత్ర కోసం ఎలాంటి లుక్ లో కనిపించడానికైనా ఆయన వెనుకాడడు. 'బద్రీనాథ్' .. 'దువ్వాడ జగన్నాథం' .. 'నా పేరు సూర్య' సినిమాలు అందుకు ఉదాహరణగా కనిపిస్తాయి. ఇక సుకుమార్ దర్శకత్వంలో .. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న 'పుష్ప' సినిమాలోను ఆయన డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఇలా బన్నీ ప్రతి సినిమాను ఒక తపస్సులా .. ప్రతి పాత్రను ఒక పాఠంలా భావిస్తూ తనని తాను మల్చుకుంటున్నాడు .. అందరి మనసులను గెలుచుకుంటున్నాడు .. తన రూటేవేరనే విషయాన్ని నిరూపిస్తున్నాడు.