Begin typing your search above and press return to search.

బన్నీ కూడా సమర్పించేసుకుంటున్నాడు

By:  Tupaki Desk   |   13 Nov 2015 11:30 AM GMT
బన్నీ కూడా సమర్పించేసుకుంటున్నాడు
X
హీరోలు నిర్మాతగా అవతారం ఎత్తడం మన దగ్గర కొత్తేం కాదు. స్టార్ హీరోల్లో నాగార్జున ఎప్పటినుంచో నిర్మాత. వెంకీకి సురేష్ ప్రొడక్షన్స్ ఉంది. చిరుకి అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ ఉంది. ఇక ఈ తరంలో అయితే మహేష్ బాబు రీసెంట్ గా తన సినిమాల నిర్మాణంలో భాగం తీసుకుని, తనూ ఓ ప్రొడ్యూసర్ అయిపోతున్నాడు. రామ్ చరణ్ కూడా రెండు బ్యానర్స్ స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్పాడు. వీళ్లంతా నిర్మాతలుగా వ్యవహిరంచడం పెద్ద వింత ఏం కాదు. కానీ అల్లు అర్జున్ నిర్మాతగా మారిపోతాననడం ఆసక్తి కలిగించే విషయమే.

ఎందుకంటే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ మెగా ప్రొడ్యూసర్. స్టోరీ సెలక్షన్ - దాని పిక్చరైజేషన్ విషయంలో ఎనలేని కేర్ తీసుకుని, హిట్ పట్టాలెక్కించేవరకూ వెంట ఉండే అల్లు అరవింద్ కి.. ఇప్పుడు గీతా ఆర్ట్స్ - గీతాఆర్ట్స్2 అనే రెండు బ్యానర్స్ ఉన్నాయి. మరి రెండు బ్యానర్స్ ఉండగా అల్లు అర్జున్ నిర్మాతగా మారనుండడం.. అది కూడా తండ్రి నిర్మాతగా వ్యవహరించిన మూవీని రీమేక్ చేయడంతో కొత్త కెరీర్ మొదలుపెట్టడం ఆశ్చర్యకరమే. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయి.. పెట్టుబడికి 4-5 రెట్లు వసూళ్లు సాధించింది భలేభలే మగాడివోయ్. నాని హీరోగా మారుతీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మగాడు.. చిన్న చిత్రాలకు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసేశాడు. ఇప్పుడీ మూవీని తమిళ్ లో రీమేక్ చేస్తుండగా.. దానికి అల్లు అరవింద్ కూడా ఓ ప్రొడ్యూసర్.

అయితే.. భలేభలే మగాడివోయ్ చిత్రాన్ని కన్నడ ఇండస్ట్రీలో సొంతగా తీయనున్నాడు అల్లు అర్జున్. ఇలా ఓ కన్నడ మూవీకి నిర్మాణ బాధ్యతలు వహించి.. ప్రొడ్యూసర్ అవతారమెత్తుతున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ లో ఇతగాడు స్టైలిష్ స్టార్. కేరళలోనూ మనోడికి ఫుల్లు ఫాలోయింగ్ ఉంది. కోలీవుడ్ లోనూ మంచి పట్టే ఉంది. ఇప్పుడు శాండల్ వుట్ లో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి.. తన బ్రాండ్ ని సౌతిండియాకి ఎక్స్ పాండ్ చేసేస్తున్నాడు బన్నీ..