Begin typing your search above and press return to search.

పెద్ద స్టారే.. కానీ ట్రోలింగ్ తప్పడం లేదు!

By:  Tupaki Desk   |   17 Jan 2019 10:50 AM GMT
పెద్ద స్టారే.. కానీ ట్రోలింగ్ తప్పడం లేదు!
X
కాదేదీ కవితకనర్హం అని పెద్దాయన శ్రీశ్రీ అన్నారు గానీ ఈ కాలంలో కాదేదీ వివాదానికి అనర్హం.. కాదేదీ ట్రోలింగ్ కు అనర్హం అని మనం అన్వయించుకోవాల్సి వచ్చేలా ఉంది. సెలబ్రిటీలు మాట్లాడేసమయంలోనూ.. సోషల్ మీడియాలో ట్వీట్లు వేసే సమయంలో మహా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నెటిజనులు ఎవ్వరినీ వదిలిపెట్టరు. గతంలో తనకు సన్నిహితులైనవారి సినిమాలన్నీ అద్భుతం అనే రాజమౌళి ఈమధ్య మొహమాటాన్ని బాగా తగ్గించుకున్నాడు.. అందుకు కారణం ఈ నెటిజనుల విమర్శలే. ఇక వీరి తాకిడి మొదటి నుండి స్టైలిష్ స్టార్ కు కూడా కాస్త ఎక్కువే.

అల్లు అర్జున్ పీఆర్ టీమ్ చేస్తున్న హడావుడితో ప్రమోషన్ సంగతేమో గానీ కాస్త నెగెటివిటీ కూడా వస్తోంది. కొద్ది రోజుల క్రితం 'పడి పడి లేచె మనసు' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో శర్వానంద్‌ను 'గారు' అని సంబోధించడమే కాకుండా ఫిలిం స్టార్లను.. పొలిటీషియన్లను 'గారు' అని గౌరవంతో సంబోధించాలని క్లాస్ పీకడం చాలామంది నచ్చలేదు. గారు పై భారీగానే ట్రోలింగ్ జరిగింది. తాజాగా బన్నీ సంక్రాంతి జరుపుకోవడానికి తన కుటుంబంతో పాటుగా పాలకొల్లు వెళ్ళాడు. అక్కడ ఫ్యాన్స్ హంగామా.. ర్యాలీలు.. ఆ ఫోటోలతో సోషల్ మీడియాలో హంగామా చూసిన వారు సంక్రాంతికి వెళ్ళాడా లేక రాజకీయ యాత్రకు వెళ్ళాడా అని ఓపెన్ గానే సెటైర్లు వేస్తున్నారు.

ఇవి చాలదన్నట్టు సంక్రాంతి రోజున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ చేశాడు. కానీ కొద్దిగంటల తర్వాత అదే ట్వీట్ ను మళ్ళీ రిపీట్ చేసి ఆ ట్వీట్ తో పాటుగా ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటోలో బన్నీ భారీగా పోగయిన జనాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు.. చేతిలో ఒక మైక్ ఉంది. జనాల మధ్యలో ఒక పోస్టర్ ఉంది. ఆ పోస్టర్ లో ఒక అభిమాని తన గుండెల్లో బన్నీ ఉన్నట్టుగా డిజైన్ చేశారు. ఆ పోస్టర్ కు టైటిల్ 'నా దేవుడు' అని ఉంది. ఇంకేముంది? నెటిజనులు బన్నీ ని ట్రోలింగ్ చెయ్యడం స్టార్ట్ చేశారు. బన్నీ కావాలనే రెండో సారి ఫోటో షేర్ చేశాడని.. తనపై జనాల్లో ఎంత అభిమానం ఉందో చూపించుకునేందుకు ఇదంతా చేస్తున్నాడని విరుచుకుపడ్డారు.