Begin typing your search above and press return to search.

బన్నీ ఓపెన్ ఆఫర్..

By:  Tupaki Desk   |   24 July 2015 6:02 AM GMT
బన్నీ ఓపెన్ ఆఫర్..
X
స్పోర్ట్స్ నేపథ్యంలో బాలీవుడ్లో రియలిస్టిక్ గా అనిపించే అద్భుతమైన సినిమాలు వస్తుంటాయి. క్రికెట్ నేపథ్యంలో లగాన్ తీసి దేశం మొత్తానికి పిచ్చెక్కించాడు అమీర్ ఖాన్. షారుఖ్ ఖాన్ హీరోగా హాకీ మీద తీసిన ‘చక్ దే ఇండియా’ అప్పట్లో పెద్ద సంచలనం. ఆ తర్వాత గోల్, బాగ్ మిల్కా బాగ్, మేరీకోమ్ లాంటి సినిమాలు కూడా జనాల్ని ఆకట్టుకున్నాయి. స్పోర్ట్స్ సినిమా అనగానే యూత్ ఆటోమేటిగ్గా కనెక్టయిపోతారు కాబట్టి.. ఆసక్తికరంగా తీయగలిగితే మంచి మార్కెట్ ఉంటుంది. తెలుగులో ఒక్కడు, కబడ్డీ కబడ్డీ, సై లాంటి సినిమాలకు స్పోర్ట్స్ టచ్ ఉంది. అవి మంచి విజయం సాధించాయి. ఐతే పూర్తి స్థాయి స్పోర్ట్స్ మూవీ.. సీరియస్ నెస్ ఉన్న సినిమా తెలుగులో రాలేదు.

ఐతే అలాంటి సినిమా కథాంశమేదైనా ఉంటే తాను నటించడడానికి రెడీ అని అంటున్నాడు అల్లు అర్జున్. ఇటీవలే ఆరంభమైన ‘ప్రొ కబడ్డీ లీగ్’కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న బన్నీ.. స్పోర్ట్స్ మూవీ పట్ల తన ఆసక్తిని వెల్లడించాడు. ‘‘కబడ్డీ మనదైన క్రీడ. మన సంస్కృతిలో భాగం. చిన్నపుడు కబడ్డీ బాగా ఆడేవాణ్ని. కానీ తర్వాత మానేశా. సినిమాల తర్వాత నేను ఏ రంగంవైపైనా ఆసక్తిగా చూస్తానంటే అతి క్రీడలే. ఎవరైనా మంచి కథ చెబితే క్రీడా నేపథ్యంలో సినిమా చేయడానికి నేను రెడీ. కానీ కథ పక్కాగా ఉండాలి’’ అన్నాడు బన్నీ. చాలా ఫిట్ గా, ఓ స్పోర్ట్స్ మన్ లా కనిపించే బన్నీకి స్పోర్ట్స్ మూవీ అంటే నిజంగానే బాగా సూటవుతుంది. కాబట్టి బాలీవుడ్ స్ఫూర్తితో మంచి కథ ఒకటి తయారు చేసుకుని బన్నీతో సినిమా తీస్తే బెటర్.