Begin typing your search above and press return to search.

అలా గనుక జరక్కపోతే షర్టు విప్పేసి తిరుగుతాను

By:  Tupaki Desk   |   17 Dec 2021 4:09 AM GMT
అలా గనుక జరక్కపోతే షర్టు విప్పేసి తిరుగుతాను
X
టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఫారెస్టు నేపథ్యంలో సినిమాలు పెద్దగా రాలేదు. వచ్చినా ఒక అంశంగా ఫారెస్టును టచ్ చేశారేమో తప్ప, పూర్తిస్థాయిలో ఫారెస్టులో సాగిన కథలు మాత్రం ఎవరూ చేయలేదు. ఒక దట్టమైన అడవి .. ఆ అడవిని నమ్ముకుని జీవించే కొన్ని గూడాలు .. ఎర్రచందనం అక్రమరవాణాలో పాలుపంచుకునే కూలీలు .. అవసరమైతే ప్రాణాలకు తెగించే వాళ్ల ధైర్యం .. స్మగ్లింగ్ వెనక ఉన్న పెద్దలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటే, స్మగ్లింగ్ కూలీలు పోలీసుల చేతిలో నానా హింసలు పడటం ఇవన్నీ 'పుష్ప' సినిమాలో కనిపిస్తాయి.

ఇలా ఈ సినిమాకి సంబంధించిన కథా వస్తువు అంతా కూడా అడవి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. చేసేది న్యాయమో .. అన్యాయమే ఆలోచించే సమయం లేదు. అడవిని నమ్ముకునే బ్రతకాలి .. అడవిలోనే చావాలి అనే ఒక సూత్రంతో అక్కడి స్మగ్లింగ్ గ్యాంగ్ పనిచేస్తూ ఉంటుంది. అలాంటివారి మనోభావాలకు 'దాక్కో దాక్కో మేక' అనే పాట అద్దం పడుతుంది.

సాధారణంగానే ఫారెస్టు నేపథ్యం కలిగిన సినిమాలు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాయి. అడవిలో జరిగే అక్రమాలను మనం రహస్యంగా గమనిస్తూన్నామనే ఫీలింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాంటి దట్టమైన అడవికి బలమైన కథ దొరికితే ఎలా ఉంటుందనే చెప్పే సినిమానే 'పుష్ప'.

నిన్న జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ, ''సుకుమార్ నాకు ఈ సినిమా చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆయనతో ఇంతకుముందు రెండు సినిమాలు చేశాను గనుక ఆయన టేకింగ్ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. అయితే ఈ సినిమా కథ వేరు .. సాధారణ లొకేషన్స్ లో సినిమా తీయడం వేరు.

అడవిలో షూటింగు చేయడం వేరు. నిజంగా ఈ సినిమా కోసం సుకుమార్ చాలా కష్టపడ్డాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కష్టమే ఈ సినిమా. ప్రతి ప్రేక్షకుడిని మాత్రమే కాదు .. ప్రతి దర్శకుడికి ఆశ్చర్య పరిచే సినిమా ఇది.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ కథతో కనెక్ట్ అవుతారు. ఈ కథలోని పాత్రలతో కనెక్ట్ అవుతారు. ఈ పాటల్లో వాళ్లు భాగమవుతారు. ఈ సినిమా చూసిన తరువాత అడవి నేపథ్యంలోని ఒక సినిమాను ఇలా కూడా తీయవచ్చా? ఈ తరహా కథలను ఈ రేంజ్ లో తెరపై చూపించవచ్చా? అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు.

నేను అనుకున్నట్టుగా జరిగితే దర్శకుడిగా సుకుమార్ మరో స్థాయికి చేరుకున్నట్టే .. ఆయనపై ప్రశంసలు కురిసినట్టే. ఆయనని ప్రతి ఒక్కరూ కలుసుకుని 'ఇదెలా సాధ్యం?' అంటూ అభినందించకపోతే, నేను షర్టు విప్పేసి మైత్రీ ఆఫీసులో తిరుగుతాను" అంటూ ఈ సినిమాపై తనకి గల నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.