Begin typing your search above and press return to search.

'ఆహా' ఈవెంట్ లో బన్నీ రివీల్ చేసిన సర్ప్రైజెస్ ఇవే..!

By:  Tupaki Desk   |   14 Nov 2020 3:30 AM GMT
ఆహా ఈవెంట్ లో బన్నీ రివీల్ చేసిన సర్ప్రైజెస్ ఇవే..!
X
డిజిటల్ వరల్డ్ లో 100శాతం తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అంటూ వచ్చిన 'ఆహా' ఓటీటీ అనతికాలంలోనే మంచి విజయాన్ని అందుకుంది. అప్పటికే సత్తా చాటుతున్న ఓటీటీ దిగ్గజాలకు పోటీగా నిలిచింది. థియేటర్స్ మూతబడటంతో 'ఆహా' లో ఎంటర్టైన్మెంట్ కోసం ఒరిజినల్ మూవీస్ - వెబ్ సిరీస్ లతో పాటు కొత్త సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారు. అయితే 'ఆహా' సక్సెస్ వెనుక స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఉన్నాడనే విషయం తెలిసిందే. 'ఆహా'లో వ‌ర్కింగ్ పార్ట‌న‌ర్ గా ఉండటంతో పాటు అన్నింటా తానే ఉంటూ ఈ యాప్ ను ముందుకు న‌డిస్తున్నాడు. ఇప్పటికే 18 మిలియన్ల యూజర్స్ మరియు 5 మిలియన్ల డౌన్‌ లోడ్స్‌ తో జెట్ స్పీడ్‌ తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో దీపావళి ని పురస్కరించుకుని శనివారం రాత్రి హైదరాబాద్‌ లో 'అల్లు అర్జున్‌ సమర్పించు ఆహా గ్రాండ్‌ రివీల్‌ ఈవెంట్‌' నిర్వహించారు.

ఈ సందర్భంగా బన్నీ నాలుగు సర్ప్రైజ్ లు రివీల్ చేసాడు. ‘‘తెలుగులో నలుగురు బిగ్ డైరెక్టర్స్ సుకుమార్‌ - హరీశ్‌ శంకర్‌ - సురేందర్‌ రెడ్డి - వంశీ పైడిపల్లి ‘ఆహా’లో షోలు చేయబోతున్నారు. ఈ నలుగురితోనూ నేను వర్క్ చేసాను" అని బన్నీ తెలిపారు. ఇంకా బన్నీ మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ ఎలా ఉన్నాయో రేపు ఓటీటీ అనేది డిజిటల్‌ ఇండస్ట్రీగా ఎదుగుతుంది. దాన్ని మా నాన్న తెలుగుకు తీసుకురావడం, అచ్చమైన తెలుగు ఓటీటీ ‘ఆహా’ ప్రారంభం కావడం గర్వంగా ఉంది. ఈ ఓటీటీ వేదిక కంటెంట్‌ కి సంబంధించినది. నా స్నేహితుడు రామ్‌ జూపల్లి, వాళ్ల ఫ్యామిలీకి చెందిన మైహోమ్‌ గ్రూప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కు ఇండస్ట్రీలోకి ప్రవేశించాలని ఉందని చెప్పారు. మా నాన్నకూ ఇటువంటి ఐడియా ఉందని మేమంతా కలిశాం. ఇవాళ ‘ఆహా’ ఇంతలా ఎదగడానికి జూపల్లి కుటుంబానికి మాపై ఉన్న నమ్మకమే కారణం. అల్లు కుటుంబాన్ని జూపల్లి కుటుంబం ఎంతోగానో నమ్మింది'' అని చెప్పారు. ఈ సందర్భంగా ఆహా కోసం వర్క్ చేసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి కి బన్నీ స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు.

ఆహా ఈవెంట్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నవదీప్‌ ‘ఓటీటీ స్క్రీన్ పైకి అల్లు అర్జున్‌ ఎంట్రీ ఎప్పుడు?’ అని ప్రశ్నించగా... ‘వెయిట్‌ చేయాలి. సర్‌ప్రైజ్‌ కింద వస్తున్నాం’ అని బన్నీ సమాధానమిచ్చారు.
ఇక ఈవెంట్ లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించిన ‘ఆహా’ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. అలానే ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి వరకూ ‘ఆహా’లో రాబోయే కంటెంట్ ‘'రుద్రవీణ' 'కంబాలపల్లి కథలు' 'కుబూల్‌ హై' 'కుడి ఎడమైతే' 'తోడేళ్ళు' 'ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌' 'సూపర్‌ ఓవర్‌' 'లెవన్త్‌ అవర్‌' 'మైదానం' 'బియాండ్‌ టెక్ట్స్‌ బుక్‌' 'మేజ్‌' 'అన్యాస్‌ ట్యుటోరియల్‌' ప్రచార చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు వంశీ పైడిపల్లి - నందిని రెడ్డి - దిల్ రాజు - తమన్నా - పాయల్ రాజ్ పుత్ - సీరత్ కపూర్ - చాందిని చౌదరి తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.