Begin typing your search above and press return to search.

చెబితే పోయేదిగా బ‌న్నీ బ్ర‌ద‌ర్‌

By:  Tupaki Desk   |   5 May 2016 9:54 AM GMT
చెబితే పోయేదిగా బ‌న్నీ బ్ర‌ద‌ర్‌
X
నిన్న రాత్రి జరిగిన స‌రైనోడు ఈవెంట్‌ లో బ‌న్నీ నోటి నుంచి `చెప్ప‌నుగా బ్ర‌ద‌ర్` అన్న మాట ఎప్పుడైతే వినిపించిందో... అప్ప‌ట్నుంచి సోష‌ల్ మీడియా హోరెత్తిపోతోంది. చెప్ప‌నుగా బ్ర‌ద‌ర్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్విట్ట‌ర్‌ - ఫేస్‌ బుక్కులో ఫ్యాన్స్ చ‌ర్చ లేవ‌నెత్తుతున్నారు. బ‌న్నీని వెన‌కేసుకొచ్చేవాళ్లు కొద్దిమందైతే, తిట్టిపోసేవాళ్లు మ‌రికొద్దిమంది! ఇంకొద్దిమంది మాత్రం `బ‌న్నీ బ్ర‌ద‌ర్ చెప్పుంటే ఈ గోలంతా జ‌రిగేది కాదుగా` అని మాట్లాడుకొంటున్నారు. ఇంత‌కీ చెప్ప‌డం, చెప్ప‌క‌పోవ‌డం... ఈ త‌తంగ‌మంతా ఏంటంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం.

నిన్న బెజ‌వాడ‌లో స‌రైనోడు స‌క్సెస్ సంబ‌రాలు జ‌రిగాయి. అల్లు అర్జున్‌తో స‌హా మొత్తం టీమ్ అంతా హాజ‌రైంది. మామూలుగా మెగా హీరోల ఫంక్ష‌న్ ఏది జ‌రిగినా అందులో ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ నామ జ‌పం కామ‌నే. ఫ్యాన్స్ అంతా ప‌వ‌న్ గురించి హంగామా చేస్తుంటారు. అప్పుడు ప‌వ‌న్ గురించి రెండు మాట‌లు చెబితే వాళ్లు శాంత‌ప‌డతారు. ఆ త‌ర్వాత సైలెంట‌యిపోతారు. ఎవ‌రి స్పీచ్ వాళ్లు మాట్లాడేసుకోవ‌చ్చు. బ‌న్నీ మాట్లాడేట‌ప్పుడు కూడా ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ నినాదాల హోరెత్తిపోయింది. పవ‌న్ గురించి ఏదైనా మాట్లాడాలంటూ ఫ్యాన్స్ హంగామా చేశారు కాసేపు.

ప్ర‌తీ వేడుక‌లోనూ ప‌వ‌న్ బాబాయ్ అంటూ ఆయ‌న గురించి ఉత్సాహంగా మాట్లాడే బ‌న్నీ ఈసారి మాత్రం మొండికేశాడు. మాట్లాడనంటే మాట్లాడ‌నన్న‌ట్టుగా త‌లూపాడు. చెప్ప‌నుగా బ్ర‌ద‌ర్ అని తన సినిమా ప్ర‌సంగం కంటిన్యూ చేశాడు. అప్ప‌ట్నుంచి ఇంటర్నెట్‌ లో బ‌న్నీ గురించి ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ మొద‌లైంది. మొద‌ట్లో ప‌వ‌న్ గురించి మాట్లాడిన మాట‌ల్ని - ఇప్పుడు ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన‌ప్పుడు చెప్ప‌నుగా బ్ర‌ద‌ర్ అన్న మాటల్ని ప‌క్క‌ప‌క్క‌నే పెట్టి ``అల్లు అర్జున్ ఎంత‌గా మారిపోయాడో చూడండి`` అంటూ నెటిజ‌న్ల‌కి చూపుతున్నారు కొద్దిమంది ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ఫ్యాన్స్. మెగా కుటుంబం - ఫ్యాన్స్ అంతా ఒక్క‌టే. కానీ బ‌న్నీ ప‌వ‌న్ గురించి చెప్ప‌నంటే చెప్ప‌ను అన్నందుకు ఆ ఫ్యాన్స్‌ లోనే రెండు వ‌ర్గాలుగా చీలిపోయి చ‌ర్చ‌కి తెర తీస్తున్నారు.