Begin typing your search above and press return to search.

'పుష్ప' ట్రైలర్ అప్డేట్: వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ఎప్పుడంటే..?

By:  Tupaki Desk   |   29 Nov 2021 7:01 AM GMT
పుష్ప ట్రైలర్ అప్డేట్: వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ఎప్పుడంటే..?
X
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా ''పుష్ప". ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. 'పుష్ప: ది రైజ్' సినిమాని డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ కోసం అల్లు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా మేకర్స్ ట్రైలర్ కు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ తో వచ్చారు.

''పుష్ప: ది రైజ్'' మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ చేతికి ఉంగరాలు - బ్రేస్ లైట్ ధరించి.. తనదైన మేనరిజంతో ‘తగ్గేదే లే’ అని పోజ్ ఇచ్చాడు. ఊర మాస్ గెటప్ లో ఉన్న స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు.

కాగా, 'పుష్ప' చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ - కన్నడ నటుడు ధనుంజయ - సునీల్ - అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మరికొన్ని రోజుల్లో రానున్న ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

'పుష్ప: ది రైజ్' సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని హిందీలో ఏఏ ఫిలిమ్స్.. తమిళ్ లో లైకా సంస్థ.. కన్నడలో స్వాగత్ ఎంటర్ప్రైజెస్ రిలీజ్ చేయనున్నారు. ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.