Begin typing your search above and press return to search.

'హే బిడ్డా.. ఇది నా అడ్డా'.. 'పుష్ప' డ్యాన్స్ వీడియో లీక్..!

By:  Tupaki Desk   |   10 Nov 2021 11:33 AM GMT
హే బిడ్డా.. ఇది నా అడ్డా.. పుష్ప డ్యాన్స్ వీడియో లీక్..!
X
మైత్రీ టీమ్ కు లీకుల బెడద తప్పడం లేదు. వారు నిర్మించే సినిమాలకు సంబంధించి విషయాలపై ఎంతో కేర్ తీసుకొని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నా.. ఏదొక కంటెంట్ లీక్ అవుతూ ఉండటం మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న 'పుష్ప' సినిమా నుంచి తాజాగా ఓ సాంగ్ షూటింగ్ వీడియో లీక్ అయింది.

అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ డ్రామా ''పుష్ప''. నవీన్‌ యెర్నేని - వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ఓ మాస్ డ్యాన్స్ నంబర్ షూటింగ్‌ లో బిజీగా ఉంది. 'పుష్ప: ది రైజ్' లోని ఈ పాట చిత్రీకరణలో 1000 మంది డాన్సర్స్ పాల్గొంటున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఇప్పుడు షూటింగ్ స్పాట్ నుండి బన్నీ డ్యాన్స్ చేస్తున్న కొన్ని వీడియోలు ఆన్‌ లైన్‌ లో లీక్ చేయబడ్డాయి.

ఓ నెటిజన్ ఈ వీడియోని షేర్ చేస్తూ.. ''వెయిటింగ్ పుష్ప మావా.. హే బిడ్డా ఇది నా అడ్డా'' అని ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ మాస్ స్టెప్పులతో కూడిన ఈ క్లిప్పింగ్స్ నెట్టింట వైరల్‌ గా మారాయి. 'పుష్ప' కు మొదటి నుంచీ ఈ లీకుల బెడద ఉంటూనే ఉంది. 'దాక్కో దాక్కో మేక' సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వెర్షన్ తో పాటుగా ఓ ఫైట్ సీన్ మరియు కాకినాడ పోర్టులో షూటింగ్ కు సంబంధించిన ఫుటేజ్ ఆ మధ్య బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

మైత్రీ టీమ్ ఈ లీకుల వ్య‌వ‌హారాన్ని చాలా సీరియ‌స్‌ గా తీసుకున్నట్లు ఓ నోట్ కూడా రిలీజ్ చేశారు. హైదరాబాద్ సైబ‌ర్ పోలీసుల‌కు ఈ మేరకు ఫిర్యాదు చేశామని.. దీనిపై ఇన్వేస్టిగేషన్ చేస్తున్నారని.. త‌ప్పు చేసిన వారిని ప‌ట్టుకుని శిక్ష‌ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటామని నిర్మాతలు తెలిపారు. ఎవరూ ఇలాంటి పనులు చేసి లైఫ్ రిస్క్ లో పెట్టుకోవద్దని 'పుష్ప' మేకర్స్ రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ ఇలా కంటెంట్ లీక్ అవుతుండటం నిర్మాతలతో పాటుగా హీరో అభిమానులను కూడా ఇబ్బంది పెడుతోంది.

కాగా, సుక్కూ - బన్నీ కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' సినిమాని రెండు భాగాలుగా రెడీ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఇందులో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ - సునీల్ - అనసూయ - ధనుంజయ - శత్రు వంటి వారు నెగెటివ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.