Begin typing your search above and press return to search.

బన్నీ పొలిటికల్ స్టాండ్ ఇదే

By:  Tupaki Desk   |   8 April 2018 6:59 AM GMT
బన్నీ పొలిటికల్ స్టాండ్ ఇదే
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త ముక్కుసూటిగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. అందుకే పబ్లిక్ ఫంక్షన్స్ లో సైతం ఈ వ్యవహార శైలి వల్లే కొన్ని ఇబ్బందులు కూడా కొని తెచ్చుకున్నాడు. తన బర్త్ డే సందర్భంగా ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్న బన్నీ తన పొలిటికల్ స్టాండ్ కూడా స్పష్టంగా చెప్పేసాడు. తన మాట మెగాస్టార్ చిరంజీవి మాట వేరుగా ఉండదని అలా జరగడాన్ని తాను ఇష్టపడనని కుండ బద్దలు కొట్టేసాడు. చిరు మనసులో ఇప్పుడు ఏముందో తనకు తెలియదన్న బన్నీ క్రియాశీలక రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నందు వల్ల ఇప్పుడే ఏం చెప్పలేను అన్నాడు. కాని ఇప్పుడున్న కాంగ్రెస్ లో కొనసాగినా లేక తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయటం కోసం చిరు జనసేనలోకి వెళ్ళినా తాను మారు ఆలోచన చేయకుండా చిరు వెంటే నడుస్తానని అల్లు అబ్బాయి తన స్టాండ్ ఏమిటో క్లియర్ గా చెప్పేసాడు.

ప్రస్తుతం రాజకీయాల గురించి ఆలోచన లేదన్న బన్నీ ఒకవేళ ఆ అవసరం వస్తే చిరంజీవి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అని చెప్పడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో మావయ్య గీత దాటే సమస్యే లేదని తెల్చినట్టే. పైగా జనసేన పవన్ అంటూ నేరుగా ప్రస్తావించి ఒకవేళ మావయ్య అందులో ఉంటే తాను కూడా అక్కడే ఉంటాను అని చెప్పడం ద్వారా ఇప్పటికి ఉన్న గ్యాప్ ని కాస్త తగ్గించే ప్రయత్నం అయితే చేసాడు. అవకాశం ఉన్న ప్రతి సారి చిరంజీవి మీద తనకు ఎంత ప్రేమ ఉందో చెప్పే బన్నీ రాజకీయ పరమైన విషయాల్లో కూడా మావయ్య రూటే తన రూటు అని చెప్పడం ద్వారా అన్నిటికి మరోసారి చెక్ పెట్టినట్టే.

మొత్తానికి తన పుట్టిన రోజున ఇలాంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇచ్చి కొన్ని గాలి వార్తలకు చెక్ పెట్టిన అల్లు అర్జున్ మాటలను బట్టి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మావయ్య వెంట పాలిటిక్స్ లో అడుగు పెట్టేలా ఉన్నాడు. బన్నీ కొత్త సినిమా నా పేరు సూర్య మే 4 విడుదల అవుతున్న సందర్భంగా ప్రమోషన్ ఈవెంట్స్ లో మీడియా ఇంటర్వ్యూలను విస్తృతంగా ప్లాన్ చేసుకుంటున్నాడు బన్నీ.