Begin typing your search above and press return to search.

డ్యాన్సులు మారాలంటున్న బన్నీ

By:  Tupaki Desk   |   12 Jun 2016 7:35 AM GMT
డ్యాన్సులు మారాలంటున్న బన్నీ
X
టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లలో అల్లు అర్జున్ ఒకడు. కెరీర్ ఆరంభంలో ‘ఆర్య’ దగ్గర్నుంచి... లేటెస్ట్ మూవీ ‘సరైనోడు’ వరకు అదిరిపోయే డ్యాన్సులతో అదరగొట్టాడు బన్నీ. ఐతే సినిమా సినిమాకూ డ్యాన్సుల్లో కొత్తదనం చూపిస్తున్నప్పటికీ తన డ్యాన్సులు తనకే బోర్ కొట్టేస్తున్నాయని అంటున్నాడు అల్లు అర్జున్. డ్యాన్స్ కంపోజింగ్ విషయంలో మనం మారాల్సిన సమయం వచ్చేసిందని అంటున్నాడతను.

డ్యాన్సుల గురించి తన అంతరంగాన్ని వెల్లడిస్తూ.. ‘‘తొలి సినిమా గంగోత్రిలో డ్యాన్సులు చేసే అవకాశం పెద్దగా రాలేదు. ‘ఆర్య’లో మాత్రం నన్ను నేను నిరూపించుకొనే అవకాశం దొరికింది. నా ప్రేమను కోపంగానూ... పాట మెలోడీ అయినా సరే.. మూన్ వాక్ స్టెప్పు వేసి అలరించాను. అక్కడి నుంచి ప్రతి సినిమాలోనూ డ్యాన్సుల విషయంలో శ్రద్ధ చూపిస్తూ వచ్చా. గతంలో సినిమాలోని ప్రతి పాటకూ కొత్తగా డ్యాన్సులు వేయాలనుకునేవాడిని. కానీ ఇప్పుడు కనీసం ఒక్క పాటైనా వెరైటీగా ట్రై చేయాలనుకుంటున్నా. డ్యాన్స్‌ కంపోజిషన్‌ విషయంలో మనం మారాలి. మూస పద్ధతిలోంచి బయటకు రావాలి. అప్పుడే కొత్తరకం డ్యాన్సుల్ని చూపించగలం’’ అని చెప్పాడు బన్నీ.

డ్యాన్సుల విషయంలో ఇప్పటి హీరోలు ఎంత చేసినా.. చిరంజీవిని మించిన వాడు ఎవ్వరూ లేరని... ఆయన డ్యాన్సులు నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ గా ఉంటాయని బన్నీ చెప్పాడు. చిరంజీవి అంత పర్ఫెక్ట్ గా ఉంటారు కాబట్టే మనం చేయడానికి ఏమీ ఉండదన్న ఉద్దేశంతో తాను ఆయన పాటల్ని రీమిక్స్ చేయనని బన్నీ చెప్పాడు.