Begin typing your search above and press return to search.

అప్పటి నా కోరిక సైరాతో నిజమైంది: అల్లు అర్జున్

By:  Tupaki Desk   |   30 Sep 2019 11:38 AM GMT
అప్పటి నా కోరిక సైరాతో నిజమైంది: అల్లు అర్జున్
X
అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ ఒక సెక్షన్ మెగా ఫ్యాన్స్ లో మాత్రం బన్నీ పట్ల సానుకూలత లేదు. 'చెప్పను బ్రదర్' ఎపిసోడ్ నుంచి ఇది మొదలైందని ఒక వాదన ఉంది. అంతా సవ్యంగా ఉందని చెప్పే ప్రయత్నాలు మధ్యలో జరిగాయి కానీ సర్దుకున్నట్టు లేదు. కొన్ని విషయాల్లో బన్నీ స్పందించకపోవడం.. ప్రత్యేకమైన ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడనే విధంగా కొన్ని ప్రయత్నాలు జరిగినట్టు ఎక్కువమందికి అనిపించడంతో బన్నీపై మరోసారి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా 'సైరా' విషయంలో మౌనం వహించడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

'సైరా' టీజర్.. ట్రైలర్ పై స్పందించకపోవడం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకాకపోవడంతో సహజంగానే మెగా ఫ్యాన్స్ లో కొంత అసంతృప్తి నెలకొంది. వీటన్నిటికి తోడు వారంలో 'సైరా' రిలీజ్ పెట్టుకుని 'అల వైకుంఠపురములో' పాటను విడుదల చేయడంతో అది మరింతగా హాట్ టాపిక్ అయింది. అయితే వీటన్నిటికీ సమాధానం అన్నట్టుగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక పోస్ట్ పెట్టాడు.

"సైరా నరసింహారెడ్డి మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఒక భారీ చిత్రం. ఇది తెలుగు సినిమా గర్వించదగిన క్షణం. నేను అప్పట్లో మగధీర చూసినప్పుడు ఇలాంటి భారీ చారిత్రాత్మక చిత్రంలో చిరంజీవి గారు నటిస్తే బాగుంటుందని అనుకున్నాను. ఈ రోజు నా కోరిక నిజమయింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారితో ఇలాంటి అద్భుతమైన సినిమాను నిర్మించినందుకు నిర్మాత.. నా ప్రియ సోదరుడు రామ్ చరణ్ కు కృతజ్ఞతలు చెప్తూ అభినందిస్తున్నాను. ఇది ఒక కుమారుడు నాన్నకు ఇచ్చే ఉత్తమమైన బహుమతి. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులకు టెక్నిషియన్లకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి గారికి నా వందనం. ఈ సినిమా మనందరి హృదయాల్లో నిలిచిపోయేలా మ్యాజిక్ చేయాలని కోరుకుంటున్నాను - అల్లు అర్జున్." ఈ పోస్ట్ తో అయినా బన్నీ మీద వస్తున్న విమర్శలు ఆగుతాయో లేదో వేచి చూడాలి.