Begin typing your search above and press return to search.

వీడియోలు చూస్తూ తెలుగు నేర్చుకుంటున్న బన్నీ

By:  Tupaki Desk   |   22 April 2020 9:00 AM IST
వీడియోలు చూస్తూ తెలుగు నేర్చుకుంటున్న బన్నీ
X
అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ ను దక్కించుకున్న అల్లు అర్జున్‌ తదుపరి చిత్రాన్ని సుకుమార్‌ తో చేయబోతున్న విషయం తెల్సిందే. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఇప్పటికే సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతూ ఉండేది. కాని లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ జరగడం లేదు. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే షూటింగ్‌ మొదలు పెట్టేందుకు దర్శకుడు సుకుమార్‌ రెడీగా ఉన్నాడు. ఇప్పటికే కేరళలో షూటింగ్‌ కు సుక్కు ప్లాన్‌ చేసిన విషయం తెల్సిందే.

బన్నీ.. సుక్కుల కాంబో మూవీకి పుష్ప అనే టైటిల్‌ ను ఖరారు చేయడం తో పాటు బన్నీ లుక్‌ ను సినిమా కాన్సెప్ట్‌ ను రివీల్‌ చేసిన విషయం తెల్సిందే. మొదటి నుండి అనుకుంటున్నట్లుగానే ఈ సినిమాలో ఎర్ర చందనం స్మగ్లర్‌ గా బన్నీ కనిపించబోతున్నాడు. మాస్‌ లుక్‌ లో లారీ డ్రైవర్‌ గా ఈయన నటించబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్‌ తోనే క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ చిత్రంలో బన్నీ రాయలసీమ యాసను ముఖ్యంగా చిత్తూరు యాసను మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఫస్ట్‌ లుక్‌ విడుదల సమయంలోనే రాయలసీమ యాసకు సంబంధించిన హింట్‌ ఇచ్చారు. ఇప్పుడు టైం దొరికింది కనుక ఆ యాసను నేర్చుకోవాలని బన్నీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే చిత్తూరు యాసతో ఉండే వీడియోలను చూస్తూ ఆ యాసను పట్టేందుకు బన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడట. చిత్తూరు వాళ్లు మాట్లాడేది కూడా తెలుగే అయినా కూడా వారి యాస చాలా విభిన్నంగా ఉంటుంది. తమిళనాడుకు దగ్గర్లో ఉంటారు కనుక వారు ప్రత్యేకమైన యాస తో మాట్లాడుతారు. అందుకే బన్నీ తెలుగు భాషే అయినా కూడా దాన్ని నేర్చుకునేందుకు కాస్త కష్టపడుతున్నాడట.

పాత్ర మరింత నాచురల్‌ గా వచ్చేందుకు బన్నీ మాట్లాడే యాస ఉపయోగపడుతుందని అంటున్నారు. చరణ్‌ రంగస్థలం చిత్రంలో మాట్లాడిన యాసతో ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు బన్నీ మరింత శ్రద్ద తీసుకుని మరీ యాస నేర్చుకుంటున్నాడు. కనుక పుష్ప పాత్ర ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యే అవకాశం ఉందంటున్నారు.