Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ 'ఐకాన్' అటకెక్కినట్లేనా...?

By:  Tupaki Desk   |   31 July 2020 3:00 PM IST
అల్లు అర్జున్ ఐకాన్ అటకెక్కినట్లేనా...?
X
అల్లు అర్జున్ ఈ ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠపురములో' సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన జోష్ లో వెంటనే స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా పట్టాలెక్కించాడు బన్నీ. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ 'ఐకాన్' సినిమా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయి రిలీజ్ కూడా అవ్వాల్సింది. గతేడాది అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా 'ఐకాన్' ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. అయితే అనుకోని కారణాల వల్ల దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కాల్సిన ఈ మూవీ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' సినిమా కంప్లీట్ చేయడంతో పాటు 'పుష్ప'ని స్టార్ట్ చేసాడు. దీంతో 'ఐకాన్' ప్రాజెక్ట్ గురించి మర్చిపోవాల్సిందే అనే కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ ఇయర్ బన్నీ బర్త్ డే సందర్భంగా 'ఐకాన్' పోస్టర్ రిలీజ్ చేసి ఈ ప్రాజెక్ట్ సజీవంగానే ఉందని దిల్ రాజు చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్న వేణు శ్రీరామ్.. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బన్నీ సినిమాకి వర్క్ స్టార్ట్ చేస్తారని.. 'పుష్ప' పూర్తైన వెంటనే 'ఐకాన్' ప్రారంభం అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే బన్నీ ఈ రోజు నెక్స్ట్ ప్రాజెక్ట్ కొరటాల శివ కాంబినేషన్ లో అనౌన్స్ చేసి 'ఐకాన్' టీమ్ కి షాక్ ఇచ్చాడు.

కాగా కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందని అందరూ భావించినప్పటికీ 'ఐకాన్' తర్వాతే స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ లేటెస్టుగా #AA21 పేరుతో అధికారిక ప్రకటన ఇచ్చేసారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ తో కలిసి కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ యువసుధ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దీనికి అల్లు అర్జున్ ఫ్రెండ్స్ శాండీ - స్వాతి - నట్టి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం రూపొందనుందని.. 2022 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో అల్లు అర్జున్ 'ఐకాన్' అటకెక్కినట్లేనా అనే డౌట్స్ సినీ అభిమానుల్లో స్టార్ట్ అయింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ని రెండేళ్ళకి పైగా హోల్డ్ లో పెడుతూ వచ్చిన బన్నీ 2022 వరకు బిజీగా ఉండనున్నారు. కొరటాల శివ సినిమా చేసిన తర్వాత అయినా బన్నీ 'ఐకాన్' ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. దిల్ రాజు - వేణు శ్రీరామ్ లు వచ్చే ఏడాది అల్లు అర్జున్ బర్త్ డే కి దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.