Begin typing your search above and press return to search.

కరోనా బాధితుల సంరక్షణార్థం బన్నీ విరాళం

By:  Tupaki Desk   |   27 March 2020 8:30 AM GMT
కరోనా బాధితుల సంరక్షణార్థం బన్నీ విరాళం
X
తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విపత్తు వచ్చినా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుంది. హీరోలు దర్శక నిర్మాతలు తమ వంతుగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 21 రోజులు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీని వలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది, దానితో ఇల్లు గడిచే పరిస్థితి లేక పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వారిని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది.

కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. కరోనాపై పోరాటానికి నాంది పలికిన తెలుగు సినిమా హీరో నితిన్ తో మొదలైన ఆర్థిక సాయం ఇప్పుడు ఊపందుకుంది. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి - సూపర్ స్టార్ మహేష్ బాబు - ప్రభాస్ - ఎన్టీఆర్ - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - మంచు మనోజ్ - రాజశేఖర్ - అల్లరి నరేష్ - దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ - కొరటాల శివ - వి.వి.వినాయక్ - అనిల్ రావిపూడి వంటి వారు ముందుకు వచ్చి తమ వంతుగా విరాళాలు అందించడం జరిగింది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కూడా తన వంతు బాధ్యత గా విరాళం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలలో కరోనాపై యుద్ధానికి తన వంతు బాధ్యతగా 1.25 కోట్లు విరాళం అందించాడు. అంతేకాకుండా ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండండి అంటూ ఒక వీడియో ద్వారా పిలుపునిచ్చారు.