Begin typing your search above and press return to search.

డీజే.. పట్టించుకుంటున్నట్లు లేరే!

By:  Tupaki Desk   |   10 Aug 2017 11:13 AM GMT
డీజే.. పట్టించుకుంటున్నట్లు లేరే!
X
పోయినేడాది అల్లు అర్జున్ సినిమా ‘సరైనోడు’ను మలయాళంలోకి ‘యోధవు’ పేరుతో అనువాదం చేసి.. తెలుగులో విడుదలైన ఐదు వారాల తర్వాత కేరళలో రిలీజ్ చేశారు. ఆ సినిమా విడుదలకు ముందు ఎంత హంగామా నడిచిందో అల్లు అర్జున్ అభిమానులకు గుర్తే. పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేసి.. పబ్లిసిటీ కూడా పెద్దగా చేసి.. మంచి క్రేజ్ మధ్య సినిమాను రిలీజ్ చేశారు. సినిమా విడుదలకు ముందు మూణ్నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా హడావుడే నడిచింది. రిలీజ్ కూడా పెద్ద ఎత్తునే జరిగింది. కేరళ వ్యాప్తంగా కటౌట్లు.. పాలాభిషేకాలు.. అడ్వాన్స్ బుకింగ్స్.. హౌస్ ఫుల్ బోర్డులు.. ఇలా చాలానే హంగామా కనిపించింది.

కానీ బన్నీ కొత్త సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ మలయాళ వెర్షన్ విషయంలో మాత్రం ఆ హడావుడి.. హంగామా ఏమీ కనిపించట్లేదు. ఈ సినిమా తెలుగులోనే చాలా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి కానీ.. ఆ తర్వాత సినిమా నిలబడలేదు. ఈ సినిమా రివ్యూలు.. కలెక్షన్ల విషయమై చాలా వివాదాలు నడిచాయి. వసూళ్లయితే వచ్చాయి కానీ.. కంటెంట్ పరంగా చాలా వీక్ అన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఈ సినిమాపై మలయాళ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా లేదు. మామూలుగా తన సినిమాల విడుదలకు ముందు కేరళ వెళ్లి ప్రచారం చేసే బన్నీ ‘డీజే’ విషయంలో సైలెంటుగా ఉండిపోయాడు. ‘యోధవు’కు ఇచ్చినట్లుగా దీనికి పెద్ద ఎత్తున థియేటర్లు కూడా ఇవ్వలేదట. సినిమా చిన్న స్థాయిలోనే రిలీజవుతుందంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎలాంటి హడావుడి కనిపించట్లేదు. ఈ చిత్రంపై పెద్ద అంచనాలు కూడా ఉన్నట్లు లేవు. మరి ఈ పరిస్థితుల్లో ‘డీజే’ కేరళలో ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.