Begin typing your search above and press return to search.

కూతురి కోసం 'శాకుంతలం' సెట్స్ కు బన్నీ..!

By:  Tupaki Desk   |   7 Aug 2021 8:30 AM GMT
కూతురి కోసం శాకుంతలం సెట్స్ కు బన్నీ..!
X
అల్లు ఫ్యామిలీ నాల్గవ తరం నుంచి అల్లు అర్జున్ కుమార్తె అర్హ సినీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక ప్రేమగాధ ''శాకుంతలం'' చిత్రంలో ప్రిన్స్ భరత పాత్రలో లిటిల్ ప్రిన్సెస్ అల్లు అర్హ నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో అల్లు వారి అల్లరి పిల్ల కూడా పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ తన కూతురి కోసం సెట్స్ ను సందర్శించి సర్ప్రైజ్ చేశారు.

ఈరోజు శనివారం 'శాకుంతలం' షూటింగ్ స్పాట్ కు విచ్చేసిన బన్నీ.. సెట్ లోనే కాసేపు గడిపి అల్లు అర్హ పాల్గొనే సన్నివేశాల షూటింగ్ ని గమనించారు. అల్లు అర్జున్ తో పాటుగా స్నేహ - అల్లు అయాన్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో నటీనటులు సిబ్బందితో ముచ్చటించిన స్టైలిష్ స్టార్.. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ని డైరెక్టర్ గుణశేఖర్ - నిర్మాత నీలిమ గుణ బొకేతో స్వాగతం పలికారు. ప్రస్తుతం బన్నీ విజిట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అల్లు అర్హ తెరంగ్రేటం పాన్ ఇండియా మూవీతో జరుగుతుండటం విశేషం. అల్లు ఫ్యామిలీ నాల్గవ తరం నుంచి అల్లు అర్హ 'శాకుంతలం' చిత్రంతో తెరంగేట్రం చేస్తుండటం గర్వకారణమని అల్లు అర్జున్ ఇది వరకే పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, 'శాకుంతలం' చిత్రంలో సమంత అక్కినేని - మలయాళ హీరో దేవ్ మోహన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మహాభారత గాథ ఆదిపర్వంలోని శకుంతల - దుష్యంతుడి అందమైన ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

'శాకుంతలం' చిత్రానికి సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. దిల్‌ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డీఆర్‌పీ - గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై నీలిమ గుణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.