Begin typing your search above and press return to search.

బన్నీ ఫస్ట్ లుక్ తోనే ఎన్టీఆర్ రికార్డ్ లేపేసాడా..?

By:  Tupaki Desk   |   10 April 2020 6:50 AM GMT
బన్నీ ఫస్ట్ లుక్ తోనే ఎన్టీఆర్ రికార్డ్ లేపేసాడా..?
X
'అల వైకుంఠపురములో' సినిమాతో మంచి హిట్ కొట్టిన అల్లు అర్జున్ అదే ఊపుతో స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా పట్టాలెక్కించేసాడు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి 'పుష్ప' అనే టైటిల్ ఖరారు చేసారు. అలాగే ఫస్ట్‌లుక్ పోస్టర్‌ ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‌లో అదరగొట్టారు. మాసిన గెడ్డం మీసాలతో సీరియస్‌గా ఉన్న బన్నీ లుక్ చాలా కొత్తగా ఉంది. అలాగే ఆయన వేసుకున్న షర్ట్ కూడా పాత స్టైల్లో ఉంది. ‘పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఒక పోస్టర్ లో బన్నీ లుక్‌ను మాత్రమే చూపించిన సుకుమార్.. రెండో పోస్టర్‌లో మాత్రం గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుబడినట్లు చూపించాడు. అంతేకాదు, ఆ పోస్టర్‌లో బన్నీ కాలికి ఆరు వేళ్లు ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. అలాగే టైటిల్‌పై ఉన్న వేలిముద్రలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కెరీర్ తొలినాళ్లలో ‘ఆర్య' అనే సినిమా ద్వారా బన్నీకి సూపర్ హిట్ అందించాడు డైరెక్టర్ సుకుమార్. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘ఆర్య2' కూడా వచ్చింది. ఈ సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత బన్నీ - సుకుమార్ కాంబో మూడో సినిమాగా 'పుష్ప' తెరకెక్కుతోంది. బన్నీని ప్రతీ సినిమాలో కొత్తగా ప్రజెంట్ చేసిన సుక్కు ఈ సినిమా లో కూడా వైవిధ్యంగా చూపించాడు అని తెలుస్తుంది.

శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యం లో ఈ సినిమా కథ నడుస్తుందని ఈ పోస్టర్ల ద్వారా స్పష్టమయింది. ఈ 'పుష్ప' పోస్టర్స్ రిలీజైనప్పటి నుండి సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆ పోస్టర్ ఒక సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్ల లో సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో 84.1 K లైక్స్ తో అత్యధిక లైక్స్ అందుకున్న పోస్టర్ గా 'పుష్ప' పోస్టర్ రికార్డుల కెక్కింది. దీంతో గతంలో ఎన్టీఆర్ ‘అరవింద సమేత.. వీరరాఘవ' ఫస్ట్ లుక్ పోస్టర్‌కు 70.20K లైక్స్ రికార్డ్ బన్నీ బ్రేక్ చేసినట్లయింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఇంకెన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. కాగా లెక్కల మాస్టర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఇందులో బ‌న్నీకి జోడీగా లక్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. తమిళ నటుడు విజయ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.