Begin typing your search above and press return to search.

పూజకు నేను ఒక్కడినే స్పెషల్ అనుకున్నాను!

By:  Tupaki Desk   |   20 Oct 2021 2:59 AM GMT
పూజకు నేను ఒక్కడినే స్పెషల్ అనుకున్నాను!
X
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. " ఎలా ఉన్నారు? మీ అల్లరి అసలు 'తగ్గేదే లే'. చాలా ఉత్సాహంగా ఉన్నారు .. కోవిడ్ అనేది ఒకటుందని కూడా మరిచిపోయినట్టుంది. నేను ఈ ఫంక్షన్ కి వచ్చేటప్పుడే ఫస్టు కంగ్రాట్స్ అఖిల్ కి చెప్పాలని అనుకున్నాను .. 'అఖిల్ కంగ్రాట్స్' . అఖిల్ కి సక్సెస్ రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే అఖిల్ ను చూస్తే ఒక యంగర్ బ్రదర్ ను చూసిన ఫీలింగ్ ఉంటుంది.

అఖిల్ చాలా బాగా డాన్స్ చేస్తాడు .. చాలా బాగా ఫైట్స్ చేస్తాడు. ఈ సారి ఆయన మంచి కథకి ప్రాధాన్యతను ఇచ్చాడు .. ఒక కొత్త పాత్రను చేయాలనుకున్నాడు. ఆయన తీసుకున్న ఆ ఛాన్సే ఈ రోజున ఆయనకి సక్సెస్ ను తెచ్చిపెట్టింది. అక్కినేని ఫ్యామిలీతో మా ప్రయాణం చాలాకాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. ఏఎన్నార్ గారు 'మనం' సినిమాలో ఇద్దరు మనవాళ్లతో కలిసి నటించారు. ఇప్పుడు ఇద్దరు మనవాళ్లు ఒకరు తరువాత ఒకరుగా హిట్ కొట్టడం కూడా నాగేశ్వరరావు గారు పై నుంచి చూస్తూనే ఉంటారు. ఇలా ఇద్దరు బ్రదర్స్ ఒకే సీజన్లో హిట్ కొట్టడం అనేది ఎంతగా అనుకున్నా కుదరదు. నిజంగా ఇది చాలా అరుదైన విషయం.

ఇక ఇప్పుడు పూజ గురించి చెబుతాను. 'ముకుంద' సినిమా నుంచి నేను పూజను చూస్తూనే ఉన్నాను. డీజే నుంచి చూసుకుంటే సినిమా సినిమాకి తాను పెరుగుతూనే ఉంది. ప్రతి సినిమాకి ఇంకా అందంగా .. ఇంకా అందంగా మెట్లు ఎక్కుతూనే ఉంది. ఈ సినిమాలో ఆమె చాలా బాగా చేసింది. నా సొంత సినిమా సమయంలో కూడా ఈ మాటను చెప్పలేదు. పూజను ఉద్దేశించి .. 'నువ్వు ఏ హీరోతో చేస్తే ఆ హీరో సినిమా హిట్టు. నువ్వు నా ఒక్కడికే స్పెషల్ అనుకున్నాను .. కానీ కాదని నాకు అర్థమైంది .. నువ్వు అందరికీ స్పెషలే'

ఇక ఇప్పుడు 'బొమ్మరిల్లు' భాస్కర్ గురించి చెప్పాలి. నేను అప్పుడప్పుడు భాస్కర్ ను గీతా ఆర్ట్స్ లో చూస్తూనే ఉన్నాను. ఒకసారి బన్నీ వాసు నాతో అన్నాడు .. భాస్కర్ సూపర్ కథ చెప్పాడు .. త్వరలో హిట్టు కొట్టబోతున్నాం అని చెప్పాడు. అప్పుడే అనుకున్నాను ఈ సినిమా హిట్ అవుతుందని. భాస్కర్ తో సినిమా చేసి .. ఎంతో దూరం ట్రావెల్ చేసి ... అతని పెళ్లికి వెళ్లినవాడిని. ఈ రోజున ఆయనకి హిట్ పడటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. గోపీసుందర్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు .. ముఖ్యంగా 'లెహరాయి' నిజంగా చాలా బ్యూటిఫుల్ కంపొజిషన్.

బన్నీ వాసు ఈ మధ్య కాలంలో ఇంత కష్టపడటం నేను ఎప్పుడూ చూడలేదు. గత రెండు నెలలుగా వాసు ఈ సినిమా పనిపై తిరుగుతూనే ఉన్నాడు. నాగార్జున గారు మనల్ని నమ్మి ఈ సినిమా ఇచ్చారు అనే ఒక బాధ్యతను మరిచిపోకుండా ముందుకు వెళ్లాడు. బన్నీ వాసు వైపు చూస్తూ .. ' అఖిల్ అంటే ఇక్కడున్న వాళ్లందరికీ ఎంతో ఇష్టం. అలాంటి అఖిల్ కి ఒక మెమరబుల్ హిట్ ఇచ్చావ్. అంతకుముందు వాళ్ల బ్రదర్ కి ఇచ్చావ్. చాలా పెద్దోడివైపోతున్నావు .. కానీ ఎప్పటికీ నువ్వు నా బన్నీ వాసూవే మరిచిపోకు.

ఈ రోజున నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను మా నాన్నను నలభై ఏళ్లుగా చూస్తున్నాను. ఆయన ఎప్పడూ స్ట్రెస్ ఫీలవ్వగా చూడలేదు. కానీ ఫస్టు టైమ్ ఆయన లైఫ్ లో ఒక ఫోర్ మంత్స్ స్ట్రెస్ తీసుకున్నారు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది .. థియేయటర్లలో విడుదలైతే బాగుంటుంది అనుకున్నారు. ఆయనకి ఓటీటీ ఛానల్ కూడా ఉంది. ఆయన అనుకుంటే 'ఆహా'లో రిలీజ్ చేయవచ్చు. కానీ జనాలను థియేటర్లకు అలవాటు చేయాలి .. మంచి సినిమా ఇస్తే జనాలు థియేటర్లకు వస్తారనే ఆశతో ఆయన ఈ సినిమాను అలా పట్టుకుని కూర్చున్నారు" అంటూ చెప్పుకొచ్చాడు.