Begin typing your search above and press return to search.

నిన్ను తగలెయ్యా .. ఎంత టెన్షన్ పెట్టావయ్యా సుకుమారూ!

By:  Tupaki Desk   |   20 Dec 2021 4:00 PM IST
నిన్ను తగలెయ్యా .. ఎంత టెన్షన్ పెట్టావయ్యా సుకుమారూ!
X
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' .. ఈ నెల 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. విడుదలైన ప్రతి ఏరియాలోను ఈ సినిమా రికార్డుస్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టింది. రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. చూసినవాళ్ల టాక్ తో సంబంధం లేకుండా చూడనివారు ఈ సినిమాకి వెళుతూనే ఉన్నారు.బన్నీ యాక్షన్ .. దేవిశ్రీ బాణీలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయని అంటున్నారు. ప్రేక్షకులను ఈ స్థాయిలో థియేటర్ కి రప్పించడంలో పాటలు ప్రధానమైన పాత్రను పోషించాయనే టాక్ వినిపిస్తోంది.

ఇక ఐటమ్ సాంగ్ ట్యూన్ పరంగా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ, సమంతనే ఈ పాటకి మైనస్ అయిందనే వాళ్లు లేకపోలేదు. సమంత మంచి ఆర్టిస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆమెను ఇలా చూడాలని ఎవరూ కోరుకోవడం లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక సునీల్ .. అనసూయ పాత్రలకి సంబంధించిన అసంతృప్తి కూడా ఆడియన్స్ లో ఎక్కువగానే ఉంది. ఆ పాత్రల నుంచి తాము ఆశించినంత అవుట్ పుట్ లేదని అంటున్నారు. ఇక మరో వైపున బన్నీ మాత్రం ఈ సినిమా వసూళ్ల పట్ల ఫుల్ ఖుషీగానే ఉన్నాడు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో సుకుమార్ ను ఇమిటేట్ చేసిన వీడియో తెగ నవ్విస్తోంది.

ఆ ఇంటర్వ్యూలో బన్నీ మాట్లాడుతూ .. "ప్రపంచంలో ఏ డైరెక్టర్ అయినా షాట్ అయిపోయిన తరువాత, యాక్టర్ కి చెప్పే ఫస్టు మాట .. టేక్ ఓకే సార్. ఎందుకంటే ఆర్టిస్ట్ అక్కడ నుంచుని వెయిట్ చేస్తుంటాడు .. లోపల ఆర్టిస్ట్ కి ఒక ఫియర్ ఉంటుంది. డైరెక్టర్ కి ఓకేనా .. కాదా? అని అతను వెయిట్ చేస్తుంటాడు. ప్రపంచనంలో ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా .. ఆ సినిమా చేస్తున్నది కొత్త డైరెక్టరే అయినా .. అతను ఓకే అంటాడా లేదా అనే ఫియర్ తో నుంచుని ఉంటాడు. సుకుమార్ గారు ఏం చేస్తారంటే .. నేను నుంచుని చూపిస్తాను ఉండండి" అంటూ బన్నీ లేచి నుంచున్నాడు.

షాట్ అయిపోగానే నేను దూరం నుంచే ఇదిగో ఇలా సుకుమార్ వైపు చూస్తాను. సుకుమార్ ఇలా నుంచుని మానిటర్ చూస్తుంటాడు. ఏం మాట్లాడకుండా తలను గోక్కుంటూ అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్లిపోతాడు. దాంతో షాటేదో వర్కౌట్ కాలేదనుకుంటాను అని నేను ఇలా కూర్చుండి పోతాను. తరువాత చూసుకోవచ్చులే .. ఇప్పుడు ఏదో మూడ్ లో ఉన్నాడు .. డిస్టబ్ చేయకూడదు .. స్పేస్ ఇద్దాంలే అనుకుని సైలెంట్ గా ఉండిపోతాను. ఆ తరువాత కొంత సేపటికి నేను ఆయనకి ఎదురుపడినా చూడడు.

అందులో నేనున్న ఆ కాస్త్యుమ్స్ లో అసలే గుర్తుపట్టడు. నేను నెమ్మదిగా ఆయన దగ్గరికి వెళ్లి .. మళ్లీ ఒక టేక్ చేద్దామా అనే ఉద్దేశంతో . 'ఏంటి డాళింగ్ ఏదైనా ఉందా అని అడుగుతాను. ఆయన ఏదో ఆలోచిస్తూనే .. 'ఏంటీ' అంటాడు. అదే ఇందాక ఆ టేక్ .. అనగానే .. 'ఏయ్ చాలా బాగా వచ్చిందయ్యా టేక్' అంటాడు. నిన్ను తగలెయ్య సుకుమారూ .. ఎంత టెన్షన్ పెట్టావయ్యా అనుకుంటాను లోపల" అంటూ బన్నీ నవ్వేశాడు.