Begin typing your search above and press return to search.

సమంత 'శాకుంతలం' లో అల్లరి అల్లు అర్హ..!

By:  Tupaki Desk   |   15 July 2021 6:49 AM GMT
సమంత శాకుంతలం లో అల్లరి అల్లు అర్హ..!
X
'అల్లు' ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ఉనికిని చాటుకున్నారు. అల్లు రామలింగయ్య నిర్మించిన వారసత్వాన్ని అల్లు అరవింద్ కొనసాగిస్తే.. అల్లు అర్జున్ - అల్లు శిరీష్ ఆ లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు నాల్గవ తరం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. అది ఎవరో కాదు అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ.

సమంత అక్కినేని ప్రధాన పాత్రలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న 'శాకుంతలం' చిత్రంతో అల్లు అర్హ యాక్టింగ్ డెబ్యూ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో అర్హ.. ఓ కీలక పాత్ర పోషించనుంది. ఈరోజు గురువారం అర్హ సెట్స్ లో జాయిన్ అయింది. అర్హ పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ 10 రోజుల్లో పూర్తి చేస్తారని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో అల్లు వారి పిల్లలు అయాన్ - అర్హ లకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ముఖ్యంగా అర్హ తన ముద్దు ముద్ద మాట‌లతో అల్లరి చేష్ట‌ల‌తో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. అల్లు స్నేహా రెడ్డి సోషల్ మీడియా మధ్యమాలలో ఎప్పటికప్పుడు అర్హకు సంబంధించి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. దీంతో నాలుగేళ్ల వ‌య‌సులోనే తన క్యూట్‌ నెస్‌ తో అల్లు అర్హ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు తన అన్న అయాన్ కంటే ముందుగానే గుణశేఖర్ వంటి స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా తెరంగ్రేటం చేస్తోంది.

కాగా, 'శాకుంతలం' సినిమా మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల - దుష్యంతుడి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో శ‌కుంత‌ల‌గా స‌మంత.. దుష్యంతుడిగా మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు..సంగీత బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. దిల్‌ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డీఆర్‌పీ - గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.