Begin typing your search above and press return to search.

'ఆహా'ని ప్రముఖ ఓటీటీలకు పోటీగా నిలుపుతున్న మెగా ప్రొడ్యూసర్..!

By:  Tupaki Desk   |   31 Oct 2020 11:30 PM GMT
ఆహాని ప్రముఖ ఓటీటీలకు పోటీగా నిలుపుతున్న మెగా ప్రొడ్యూసర్..!
X
దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా పెరిగింది. థియేటర్స్ మూతబడటంతో ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ మూవీస్ వెబ్ సిరీస్ చూడటానికే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు కొత్త సినిమాలు కూడా ఓటీటీలలోనే డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఓటీటీల ప్రభావాన్ని ముందే ఊహించిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ డిజిటల్ వరల్డ్ లోకి ప్రవేశించారు. 'ఆహా' పేరుతో వంద శాతం తెలుగు యాప్ ని క్రియేట్ చేశారు. తెలుగు డబ్బింగ్ సినిమాలు.. వెబ్ సిరీస్ లతో పాటు కొత్త సినిమాలు కూడా స్ట్రీమింగ్ కి పెడుతూ ప్రముఖ ఓటీటీలకు పోటీ ఇస్తున్నారు.

ఆహాలో 'భానుమతి రామకృష్ణ' 'కృష్ణ అండ్ హిజ్ లీల' 'ఓరేయ్ బుజ్జిగా' 'కలర్ ఫోటో' వంటి సినిమాలను డైరెక్టర్ ఓటీటీలో పద్ధతిలో విడుదల చేసి ప్రేక్షకులను తమ వైపు తిప్పుకుంటోంది. ఇదే సమయంలో ఇతర ఓటీటీలు మాత్రం తెలుగు సినిమాల డైరెక్ట్ రిలీజుల విషయంలో అంతగా వ్యూయర్ షిప్ తెచ్చుకోలేకపోతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రొడక్షన్ లో తలపండిన అల్లు అరవింద్ తన అనుభవంతో సినిమాలను కొనుగోలు చేస్తూ సక్సెస్ అవుతున్నాడని తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఎలాంటి కంటెంట్ ని ఆదరిస్తారో ముందే పసిగట్టిన మెగా ప్రొడ్యూసర్ 'ఆహా' లో ఆకట్టుకునే కంటెంట్ ని అప్లోడ్ చేస్తూ మేటిగా నిలుపుతున్నాడు. థియేట్రికల్ రిలీజుల విషయంలో ఎలా ప్రమోషన్స్ చేస్తారో అదే రీతిలో ఓటీటీ సినిమాలకు కూడా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. టాక్ తో సంబంధం లేకుండా చిన్న సినిమా డబ్బింగ్ సినిమా అని చూడకుండా.. సినిమాలను ప్రమోట్ చేస్తూ సబ్ స్క్రైబర్స్ ని పెంచుకుంటూ పోతున్నారు. మిగతా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కూడా 'ఆహా' ని ఫాలో అయితే మంచిందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదిలా ఉండగా దీపావళి సందర్భంగా నవంబర్ 14న సిద్ధు జొన్నలగడ్డ - సీరత్‌ కపూర్‌ జంటగా నటించిన 'మా వింత గాధ వినుమా' సినిమా 'ఆహా' లో విడుదల కానుంది. ఇదే క్రమంలో నవంబరు 13న పాయల్‌ రాజ్‌ పుత్ - చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన 'అనగనగా ఓ అతిథి' సినిమా 'ఆహా' లో రిలీజ్ చేస్తున్నారు. ఈ విధంగా 'ఆహా' తెలుగు సినిమా ప్రేక్షకులకు సాధ్యమైనంత మంచి కంటెంట్ ని ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.