Begin typing your search above and press return to search.

అల్లు అరవింద్ ఇచ్చిన హిట్లు .. మెగాస్టార్ కి మెట్లు!

By:  Tupaki Desk   |   16 Oct 2021 8:19 AM GMT
అల్లు అరవింద్ ఇచ్చిన హిట్లు .. మెగాస్టార్ కి మెట్లు!
X
సాధారణంగా ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందనే నానుడి లోకంలో ఉంది. చిరంజీవి విజయం వెనుక ఆయన శ్రీమతితో పాటు బావమరిది అల్లు అరవింద్ పాత్ర ఉండటం కూడా విశేషం. తెలుగు ఇండస్ట్రీలో బావ - బావమరుదులకు చిరంజీవి - అల్లు అరవింద్ ఆదర్శమని చెప్పుకోవడానికి సంశయించవలసిన అవసరం లేదు. ఎందుకంటే చిరంజీవి ఇంటికి వస్తే ఆయనను కంటికి రెప్పలా ఆయన శ్రీమతి చూసుకుంటే, ఆయన కెరియర్ కి సంబంధించిన విషయాలను అల్లు అరవింద్ కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు.

ఒక బావను .. ఒక బావమరిది అంతగా అంటిపెట్టుకుని ఉండటం మనకి చిరంజీవి - అల్లు అరవింద్ విషయంలో మాత్రమే కనిపిస్తుంది. అప్పట్లో చిరంజీవి వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళుతున్నారు. అందువలన తరువాత సినిమాలకి సంబంధించిన కథలను వినే తీరిక ఆయనకి ఉండేది కాదు. అందువలన ఆ విషయాలన్నీ అల్లు అరవింద్ చూసుకునేవారు. ఆయన దగ్గర లేనప్పుడు చిరంజీవి కథలు వినేవారు కాదు .. ఆయన ఓకే అంటే చిరంజీవి అభ్యంతరం చెప్పేవారు కాదు. అల్లు అరవింద్ పై .. ఆయన ఆలోచనా విధానంపై చిరంజీవికి అంత నమ్మకం ఉండేది.

ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ ను ఏర్పాటు చేసిన తరువాత అల్లు అరవింద్ .. చిరంజీవిలోని నటుడిని కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. ఆయన నుంచి అభిమానులు ఆశించే కథలను తెరకెక్కించే విషయంలో ఖర్చుకు వెనుకాడలేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో చిరంజీవి చేసిన ఫస్టు మూవీ 'శుభలేఖ'. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సొంత బ్యానర్ కి శుభారంభం పలికింది. ఆ తరువాత సినిమాగా అల్లు అరవింద్ 'యమకింకరుడు' సినిమాను నిర్మించారు. యాక్షన్ హీరోగా చిరంజీవిని ఈ సినిమా మరింత ముందుకు తీసుకెళ్లింది.

ఇక ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'హీరో' ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, 'విజేత' సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. 'ఆరాధన' సినిమా వసూళ్లు నిరాశ పరిచినా, ఒక మంచి ప్రయత్నం అనిపించుకుంది. ఆ తరువాత వచ్చిన సినిమానే 'పసివాడి ప్రాణం'. ఈ సినిమాకి ముందు చిరంజీవి కెరియర్ అంత సవ్యంగా లేదు. అలాంటి పరిస్థితుల్లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా, చిరంజీవికి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. 'ఖైదీ' తరువాత ఆయన కెరియర్ ను మలుపు తిప్పిన ఈ సినిమాగా ఇది కనిపిస్తుంది.

'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' సినిమాతో ఆ జోరు కంటిన్యూ అయింది. ఇక చిరంజీవిని 'ప్రతిబంధ్' సినిమాతో తన సొంత బ్యానర్ పై బాలీవుడ్ కి పరిచయం చేసిన ఘనత కూడా అల్లు అరవింద్ కే దక్కుతుంది. గీతా ఆర్ట్స్ కి కూడా ఇదే మొదటి హిందీ సినిమా. ఆ తరువాత ఈ బ్యానర్ 'రౌడీ అల్లుడు' .. 'మాస్టర్' .. 'అన్నయ్య' వంటి హిట్లను చిరంజీవికి అందించింది. ఇతర నిర్మాతలతో కలిసి చిరంజీవితో అల్లు అరవింద్ 16 సినిమాలు నిర్మించారు. సోలోగా నిర్మించిన సినిమాలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే 12 సినిమాలు ఆ జాబితాలో కనిపిస్తాయి.

16 సినిమాలలో 8 సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. మిగతా సినిమాలలో కొన్ని యావరేజ్ అనిపించుకుంటే, మరికొన్ని ఫ్లాప్ బారిన పడ్డాయి. అయితే చిరంజీవి కెరియర్ గ్రాఫ్ ఎప్పుడైతే ఎక్కడైతే పడిపోతూ ఉందనిపించిందో, అప్పుడు అల్లు అరవింద్ ఆయనకి తిరుగులేని హిట్ ఇస్తూ వచ్చారు. ఆ సినిమాలు చిరంజీవి స్థానానికి ఎలాంటి ఢోకా లేకుండా ఒక రక్షణ కవచంలా కాపాడుతూ వచ్చాయి. ఆయన మరో స్థాయికి వెళ్లడానికి మెట్లుగా మారాయి. 'బావమరిది బ్రతుకగోరతాడు' అని తెలుగులో ఒక నానుడి ఉంది. అది చిరంజీవి .. అల్లు అరవింద్ విషయంలో అక్షరాలా నిజమనిపిస్తుంది. చిరంజీవి క్రమశిక్షణ .. కష్టపడేతత్వానికి, అల్లు అరవింద్ ప్లానింగ్ తోడు కావడం వల్లనే, ఇన్ని విజయాలు .. అన్ని రికార్డులు సాధ్యమయ్యాయని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు.