Begin typing your search above and press return to search.

దటీజ్ అల్లు అరవింద్

By:  Tupaki Desk   |   7 Sept 2015 7:29 PM IST
దటీజ్ అల్లు అరవింద్
X
ఇప్పుడు ఓ పెద్ద హీరోతో సినిమా తీయాలంటే కనీసం రూ.40 కోట్లు చేతిలో ఉండాలి. ఆ మేరకు బడ్జెట్ అని బరిలోకి దిగితే.. లెక్క ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇంతా ఖర్చు పెట్టి సినిమా తీస్తే.. ఆమేరకు బిజినెస్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. బాగా క్రేజ్ వచ్చినా, సినిమా బాగా ఆడినా లాభం అటు ఇటుగా ఓ పది కోట్లు వస్తే ఎక్కువ. ఐతే మన సినిమాల్లో సక్సెస్ రేట్ ఎంతో తెలిసిందే కాబట్టి.. భారీ పెట్టుబడి పెట్టిన ప్రతిసారీ చేతికి డబ్బులొస్తాయన్న గ్యారెంటీ లేదు. అందులోనూ సినిమా ఆలస్యమైతే.. రిజల్ట్ తేడా వస్తే.. లాభం సంగతి దేవుడెరుగు భారీగా నష్టాలు మూటగట్టుకోవాలి. నిర్మాతగా అల్లు అరవింద్ ఎక్కువగా సక్సెస్ లే చూశాడు కానీ.. ‘బ్రదినాథ్’ సినిమా ఫ్లాపవడంతో ఆయనకు తత్వం బోధపడింది. ఆ సినిమాకు ఎన్నడూ లేనంత నష్టాలు వచ్చాయి. దీంతో అరవింద్ రూటు మార్చేశాడు.

ఒక్కసారిగా చిన్న సినిమాల గోదాలోకి దిగాడు. వేరే నిర్మాతలతో కలిసి ఐదారు కోట్లలో సినిమాలు తీయడం మీద దృష్టిపెట్టాడు. తొలి ప్రయత్నంలో తీసిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ఆయన కొత్త ప్రయత్నానికి శుభారంభాన్నిచ్చింది. పెట్టుబడి మీద రెట్టింపు చేతికొచ్చింది. ఇప్పుడు ‘భలే భలే మగాడివోయ్’ని కూడా ఐదారు కోట్లలోనే తీశారు. ఇప్పుడా సినిమా పెట్టుబడి మీద మూణ్నాలుగు రెట్లు వసూలు చేసేలా ఉంది. లాభాలు ఇద్దరు నిర్మాతలకు, దర్శకుడికి మధ్య పంపకాలు జరుగుతున్న మాట వాస్తవమే కానీ.. అయినప్పటికీ భారీగానే లాభాలు అందుకోబోతున్నాడు అరవింద్. ఆయన పెట్టుబడి మహా అయితే కోటో రెండు కోట్లో ఉంటుంది. ఐతే ఆదాయం ఐదు కోట్లకు తక్కువుండే అవకాశం లేదు. ఫార్ములా ఎంత బాగా వర్కవుటైందో చూశారా? తక్కువ బడ్జెట్ కాబట్టి.. రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్స్ వచ్చేశాయి. ఈ ఫార్ములాలో వెళ్తే మున్ముందు కూడా నష్టాల మాటే లేదు. లాభం ఎంతుంటుందన్నదే ప్రశ్న. అది పెట్టుబడి మీద డబుల్ ఉండొచ్చు. మూణ్నాలుగు రెట్లు కూడా ఉండొచ్చు. ఒక భారీ బడ్జెట్ సినిమా తీసే బదులు.. ఓ పది చిన్న సినిమాలు తీసుకోవచ్చు. అందులో సగం హిట్టయినా చాలు. భారీ లాభాలు మిగుల్తాయి. ఎంతైనా అల్లు అరవింద్ బుర్రే బుర్ర.