Begin typing your search above and press return to search.

మెగా ఫ్యామిలీలో విభేదాలపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   26 Aug 2022 4:53 AM GMT
మెగా ఫ్యామిలీలో విభేదాలపై అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు..!
X
టాలీవుడ్‌ లో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని దాదాపు డజను మంది ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. తమ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. పోటీగా ఎన్ని కుటుంబాలు ఉన్నా ఎందరు హీరోలు ఉన్నా తమ ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు.

ఇప్పటి వరకు కొణిదెల మరియు అల్లు కుటుంబ హీరోలను కలిపే 'మెగా' ఫ్యామిలీగా పేర్కొంటూ వచ్చారు అభిమానులు. అయితే ఇటీవల కాలంలో రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయని సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

మెగా ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలిపోయిన నెట్టింట తరచుగా వార్స్ కు తెరలేపుతున్నారు. ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్.. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న తర్వాత ఇది మరీ ఎక్కువైందని చెప్పాలి.

స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి వేసిన బాటలోనే బన్నీ హీరో అయ్యాడని.. ఇప్పుడు అతను అనుభవిస్తున్న స్టార్ స్టేటస్ కు మెగాస్టారే కారణమని ఓ వర్గం ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలానే దివంగత లెజండరీ నటుడు అల్లు రామలింగయ్య వేసిన పూల బాటలోనే చిరు హీరోగా ఎదిగాడని.. అల్లు అరవింద్ సోదరిని పెళ్లి చేసుకున్న తర్వాతే సుప్రీం హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడని మరో వర్గం వ్యాఖ్యానిస్తోంది.

ఇదే క్రమంలో ఇప్పుడు బన్నీ మెగా ట్యాగ్ తో కాకుండా తమ 'అల్లు' బ్రాండ్ తో ముందుకు వెళ్తున్నాడనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ మీట్ లో కొందరు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నది దాటినాక తెప్ప తగలేసే వాళ్ళు తమకు వద్దని.. అతను అనుభవిస్తున్న జీవితం కేవలం మెగాస్టార్ వల్లనే అని అన్నారు.

ఇలా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా మెగా vs అల్లు అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ నడుస్తోంది. పోటాపోటీగా ట్రోలింగ్ చేసుకుంటూ నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల అల్లు అరవింద్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా అల్లు అర్జున్ కు చిరంజీవి మీదున్న ప్రేమ అభిమానం గురించి అల్లు అరవింద్ వివరించారు. 'అల వైకుంఠపురములో' ఈవెంట్ లో 'ఈ కట్టె కాలేవరకు చిరంజీవి అభిమానినే' అని బన్నీ మాట్లాడిన విషయాన్ని మెగా ప్రొడ్యూసర్ గుర్తు చేశారు. చిరంజీవి లెవెల్ వేరే అని.. ఆయన స్థాయి గురించి ఇంట్లో కూడా ఎప్పుడూ బన్నీ చెబుతూనే ఉంటాడని తెలిపారు.

చిరంజీవికి కూడా అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని.. బన్నీని కొడుకుతో సమానంగా చూసుకుంటారని అల్లు అరవింద్ అన్నారు. బన్నీ ఏం చేసినా కూడా చిరు ఎంజాయ్ చేస్తారని.. చిన్నప్పుడు బన్నీ - చరణ్ కలిసి డాన్స్ లు చేస్తుండగా చిరు ఎంకరేజ్ చేసిన ఎన్నో వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయని అల్లు అరవింద్ చెప్పారు.

సోషల్ మీడియాలో మెగా vs అల్లు అభిమానులు మధ్య వార్ నడుస్తున్న తరుణంలో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి ఫ్యాన్స్ ఇప్పటికైనా ఈ ట్వీట్ వార్స్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఒకటిగా కలిసిపోతారేమో చూడాలి.