Begin typing your search above and press return to search.

డబ్బింగ్ చిత్రాలతో అల్లరోడికి ఇబ్బందేనా..?

By:  Tupaki Desk   |   22 Nov 2022 5:30 PM GMT
డబ్బింగ్ చిత్రాలతో అల్లరోడికి ఇబ్బందేనా..?
X
దక్షిణాదిలోని టాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీల మధ్య ఇప్పుడు డబ్బింగ్ చిత్రాల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి రాబోతున్న తమిళ డబ్బింగ్ చిత్రాలకి ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. స్ట్రెయిట్ తెలుగు చిత్రాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్మాతల మండలి ప్రకటించడంతో వివాదం మొదలైంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. తమిళ డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో ప్రాధాన్యమిచ్చినా.. తెలుగు చిత్రాలకు తమిళనాట ఆశించిన థియేటర్లు ఇవ్వరనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వారం స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి రెండు డబ్బింగ్ సినిమాలు పోటీగా నిలవడం చర్చనీయంగా మారింది.

అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఈ నెల 25వ తేదీన విడుదల కాబోతోంది. జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే అదే రోజున 'లవ్ టుడే' మరియు 'తోడేలు' వంటి రెండు డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి.

తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్టైన 'లవ్ టుడే' సినిమాని తెలుగులో అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాడు. హీరో ఎవరో కూడా ఇక్కడి జనాలకు తెలియనప్పటికీ డబ్బింగ్ చిత్రానికి ప్రాముఖ్యత ఇస్తూ రెండు రాష్ట్రాల్లో 300-400 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అలానే 'తోడేలు' వంటి హిందీ డబ్బింగ్ సినిమాని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అంటే థియేటర్ల కేటాయింపు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలా దిల్ రాజు - అల్లు అరవింద్ లాంటి ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్లు తీసుకొస్తున్న రెండు డబ్బింగ్ సినిమాలతో అల్లరి నరేష్ పోటీ పడాల్సి వస్తోంది.

ఇటీవల కాలంలో పలు డబ్బింగ్ చిత్రాలు తెలుగు మార్కెట్ లో సూపర్ హిట్లుగా నిలిచాయి. కాకపోతే వాటికి హిట్ టాక్ వచ్చిన తర్వాత స్క్రీన్స్ కౌంట్ పెంచారు. కానీ ఇప్పుడు రెండు సినిమాలను రిలీజ్ చేయడమే ఎక్కువ థియేటర్లలో చేస్తున్నారని తెలుస్తోంది. అదే ఇప్పుడు అల్లరోడి సినిమాకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.

'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనేది సోషల్ డ్రామా. 'లవ్ టుడే' అనేది న్యూ ఏజ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్. 'తోడేలు' సినిమా ఒక క్రీచర్ కామేడీ. ఇలా మూడు వేటికవే ప్రత్యేకమైన జోనర్లలో రూపొందినవే. డబ్బింగ్ సినిమాలకు మంచి టాక్ వస్తే.. స్ట్రెయిట్ తెలుగు సినిమాకు కష్టాలు తప్పవు. ఓపెనింగ్స్ మీద కచ్చితంగా ప్రభావం పడుతుంది.

ఇప్పటి వరకూ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'నాంది' తరహాలోనే సీరియస్ సబ్జెక్టును డీల్ చేసినట్లు కనిపిస్తోంది. మరి రెండు డబ్బింగ్ చిత్రాలను తట్టుకొని అల్లరోడు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్టు కొడతాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.