Begin typing your search above and press return to search.

ప్రొడ్యూసర్ గారు 'అపరిచితుడు' స్క్రిప్ట్ నాది.. సర్వహక్కులు నావే: డైరెక్టర్ శంకర్

By:  Tupaki Desk   |   15 April 2021 4:54 PM GMT
ప్రొడ్యూసర్ గారు అపరిచితుడు స్క్రిప్ట్ నాది.. సర్వహక్కులు నావే: డైరెక్టర్ శంకర్
X
స్టార్ డైరెక్టర్ శంకర్ తమిళ ఉగాది సందర్బంగా తన కొత్త సినిమా అపరిచితుడు(అన్నియన్) హిందీ రీమేక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ హీరోగా శంకర్ అపరిచితుడు రీమేక్ ప్రకటించాడు. కానీ ఆయన అలా ప్రకటించి 24గంటలు గడవకముందే అపరిచితుడు ఒరిజినల్ నిర్మాత ఆస్కార్ వి రవిచంద్రన్ సినిమా రీమేక్ ఆపాలని డైరెక్టర్ శంకర్ కు లీగల్ నోటిస్ పంపించాడు. తన స్టోరీని పర్మిషన్ లేకుండా రీమేక్ చేయడం చట్టవిరుద్ధం అంటూ సంబోధించాడు. అయితే తాజాగా డైరెక్టర్ శంకర్.. నిర్మాత రవిచంద్రన్ ఓపెన్ లెటర్ పై స్పందించాడు.

ఏమని అంటే.. "రవిచంద్రన్ సార్, అన్నియన్ స్టోరీ రైట్స్ మీవే అంటూ చేసిన మెయిల్ చూసి షాకయ్యాను. 2005లో అన్నియన్ విడుదలైంది. సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సినిమా స్టోరీ, స్క్రిప్ట్ నాదేనని. అలాగే సినిమా టైటిల్స్ లో కూడా స్టోరీ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం శంకర్ అని విడుదలైంది. నేను ఏ ఒక్కరికి కూడా స్క్రిప్ట్ గాని, స్క్రీన్ ప్లేలో గాని భాగస్వామ్యం ఇవ్వలేదు. స్టోరీ - స్క్రిప్ట్ రాసిన రచయితగా నా హక్కులను నేను వినియోగించుకుంటున్నాను. ఇందులో దివంగత రచయిత సుజాత పేరు ప్రస్తావించడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అతను కేవలం డైలాగ్స్ వరకే నాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ విధంగానే డైలాగ్ రైటర్ గా ఆయనకు క్రెడిట్ ఇచ్చాము. అతను అన్నియన్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే క్యారెక్టరైజేషన్ లో ఏ మాత్రం జోక్యం చేసుకోలేదు.

స్క్రిప్ట్ నాది కాబట్టి దాన్ని పూర్తిగా వాడుకునే అర్హత నాకే ఉంది. నిజానికి అన్నియన్ హక్కులపై, రీమేక్ పై మీకు ఎలాంటి అర్హత లేదు. ఎందుకంటే నేను ఈ హక్కులు రాతపూర్వకంగా ఇవ్వలేదు. మీ దగ్గర ఎలాంటి రాతప్రతి లేనప్పుడు హక్కులు మీవే అని నొక్కిచెప్పడంలో అర్ధం లేదు. అన్నియన్ నిర్మాతగా మీరు సక్సెస్ అందుకున్నారు. అంతేగాని నా ఫ్యూచర్ ప్రాజెక్ట్ లలో కూడా మీ ఆధిపత్యం చలాయించాలని ట్రై చేస్తున్నారు. ఈ క్లారిటీ తర్వాత మీలో మంచి అభిప్రాయం కలుగుతుందని.. ఇలాంటి నిరాధరమైన వాదనలు కూడా ఆపుతారని ఆశిస్తున్నాను. నేను ఎలాంటి పక్షపాతం లేకుండా ఈ సమాధానం ఇస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి చట్టవిరుద్ధమైన, దుర్మార్గమైన వాదనలు నా ఫ్యూచర్ దెబ్బతీస్తాయని.. వాస్తవలు తెలియాలి కాబట్టి ఓ రచయితగా, దర్శకుడుగా క్లారిటీ ఇస్తున్నాను." అంటూ డైరెక్టర్ శంకర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. మరి శంకర్ రిప్లై పై నిర్మాత ఎలా స్పందిస్తాడో.. ఇంతటితో ఈ వివాదానికి బ్రేక్ పడుతుందేమో చూడాలి.