Begin typing your search above and press return to search.

వీడియో : సింగీతం వారి వయసు 92.. మనసు 25

By:  Tupaki Desk   |   31 Aug 2022 1:33 PM GMT
వీడియో : సింగీతం వారి వయసు 92.. మనసు 25
X
గ్రాఫిక్స్ లేని సమయంలో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించి ఇండియన్ సినీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన మాయాజాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలను ఇప్పటికి చాలా మంది అప్పట్లో ఇలా ఎలా చేశారంటూ ముక్కున వేలేసుకుంటారు అనడంలో సందేహం లేదు.

కొత్త దర్శకులకు ఆయన సినిమాలు డిక్షనరి గా కూడా ఉపయోగపడుతాయి. ప్రభాస్ తో ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్‌ కే సినిమా కు సింగీతం వారు మెంటర్‌ గా వ్యవహరిస్తున్నారు. కథ మరియు స్క్రిప్ట్‌ విషయంలో ఆయన ఇన్‌ పుట్స్ మరియు సలహా లు చిత్రానికి ఎంతో సహకరిస్తాయి అంటూ యూనిట్‌ సభ్యులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

తాజాగా సింగీతం వారు ఈటీవీలో ప్రసారం అయ్యే ఆలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్నారు. అలీతో ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా సింగీతం శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే వారంలో టెలికాస్ట్‌ అవ్వబోతున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా యూట్యూబ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

సింగీతం శ్రీనివాసరావు ని అలీ ఎన్నో విషయాల గురించి ప్రశ్నించారు. సింగీతం వారి వయసు 92 ఏళ్లు కాగా తన మనసు మాత్రం 25 ఏళ్ల కుర్రాడిగా ఆలోచిస్తుంది అంటూ పేర్కొన్నాడు. ఇక తన భార్య తో తనది పెళ్లి తర్వాత అద్భుతమైన ప్రేమ అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన సినీ కెరీర్ లో నిలిచి పోయే సినిమా పుష్పక విమానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పుష్పక విమానం యొక్క కథను ప్రతి ఒక్కరు కూడా అధ్బుతంగా ఉందంటూ ప్రశంసించారు. కానీ ఏ ఒక్కరు కూడా అప్పట్లో నిర్మించేందుకు ముందుకు రాలేదు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆ సినిమా ను తీసినట్లుగా సింగీతం వారు చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్‌ గారిని మొదటి సారి మాయాబజార్‌ షూటింగ్‌ లో చూసి చాలా సంతోషించాను అన్నాడు. సుదీర్ఘమైన సినీ చరిత్రలో ఎన్నో అద్భుతాలు తీసిన సింగీతం వారు బాలయ్య తో ఆదిత్య 369 సినిమా ను చేసిన విషయం తెల్సిందే. పూర్తి ఇంటర్వ్యూ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.