Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: 'అలిపిరికి అల్లంత దూరంలో' ఏం జరిగింది..?

By:  Tupaki Desk   |   12 Nov 2022 11:59 AM GMT
ట్రైలర్ టాక్: అలిపిరికి అల్లంత దూరంలో ఏం జరిగింది..?
X
ఇటీవల కాలంలో అనేక చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఈ క్రమంలో టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ''అలిపిరికి అల్లంత దూరంలో'' అనే చిత్రం రాబోతోంది. నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్యాస్కేడ్ పిక్చర్స్ బ్యానర్‌ పై రమేష్ డబ్బుగొట్టు మరియు రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్నారు.

డైరెక్టర్ నందిని రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఆనంద్ జె ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. 'అలిపిరికి అల్లంత దూరంలో' సినిమాలో నూతన నటుడు రావణ్ నిట్టూర్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. శ్రీ నికిత - అలంకృత షా - బొమ్మకంటి రవీందర్ - అమృత వర్షిణి సోమిశెట్టి - లహరి గుడివాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'మా తిరుపతి' మరియు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. 'అలిపిరికి అల్లంత దూరంలో' అనేది జీవితంతో పోరాడుతున్న తిరుపతిలో ఓ ఫోటోగ్రాఫర్ కథ అని తెలుస్తోంది.

ఇందులో ఒక ప్రేమకథ కూడా ఉంది. దాని చుట్టూ అల్లుకున్న ఓ రాబరీ డ్రామాని చూపించబోతున్నట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. తిరుపతిలో ఫోటో స్టూడియో పెట్టుకోవాలని కష్టపడే యువకుడు.. తన ప్రేయసిని పెళ్లి చేసుకోవడం కోసం ఏదొక విధంగా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు.

ఈ క్రమంలో అతడి వద్దకు వచ్చిన ఒక మనీ బ్యాగ్ ఊహించని మలుపు తిప్పుతుంది. ఈ క్రమంలో వచ్చిన సంఘటనలు కథ ఏమయ్యుంటుందనే ఆసక్తిని కలిగిస్తాయి. లవ్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్ వంటి అన్ని అంశాలతో కట్ చేసిన 'అలిపిరికి అల్లంత దూరంలో' ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

కొత్త నటీనటులతో సినిమా అంతా తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసినట్లు తెలుస్తోంది. జెకె దీనికి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ఫణి కళ్యాణ్ సంగీతం సమకూర్చారు. 'అలిపిరికి అల్లంత దూరంలో' చిత్రాన్ని నవంబర్ 18న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

తెలుగులో రాబరీ డ్రామాలు చాలా వరకు విజయవంతమయ్యాయి. ఇక్కడ రాబరీ డ్రామాతో పాటుగా కాస్త డివోషనల్ టచ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.