Begin typing your search above and press return to search.

చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన అలియా భట్!

By:  Tupaki Desk   |   9 Feb 2022 12:30 AM GMT
చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన అలియా భట్!
X
బాలీవుడ్లో అలియా భట్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అందం .. అభినయం పుష్కలంగా ఉండటంతో వరుస సినిమాలతో ఆమె దూసుకుపోతోంది. అక్కడి యూత్ లో ఆమెకి ఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ లో ఆమె తాజా చిత్రంగా 'గంగూబాయి కతియావాడి' రూపొందింది. ఈ నెల 25వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. దాంతో ఈ సినిమాకి భారీస్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. అలియా అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఇష్టంగా .. ఇంట్రెస్టింగా ఎదురుచూస్తున్నారు.

తెలుగులో 'ఆర్ ఆర్ ఆర్' వంటి భారీ చారిత్రక చిత్రంతో అలియా పరిచయమవుతోంది. ఈ సినిమాలో ఆమె ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఇంతవరకూ ఆమె చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఆమె పాత్ర ఉండనుంది. ఆమె లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, తెలుగులో మరో భారీ ఆఫర్ ను అలియా భట్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ ఒక ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని వెళుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన అలియాను తీసుకున్నారు.

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందువల్లనే అలియాను ఎంపిక చేశారు. మిక్కిలినేని సుధాకర్ - కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నిన్న పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. లాంఛింగ్ నుంచే అలియా వైపు నుంచి హైలైట్ చేయాలనే ఉద్దేశంతో ఆమెను ఆహ్వానించారట. పూజా కార్యక్రమాలకు వస్తానని అలియా చెప్పడంతో, అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారట. అయితే 'గంగూబాయి' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అలియా తాను రాలేకపోతున్న విషయాన్ని చివరి నిమిషంలో చెప్పిందట.

దాంతో పూజా కార్యక్రమాలను వాయిదా వేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అలియాకి కుదిరినప్పుడే పూజా కార్యక్రమాలు పెట్టుకోనున్నట్టు తెలుస్తోంది. మరి అలియా ఎప్పుడు తీరిక చేసుకుంటుందో చూడాలి. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను తీసుకున్నారు. ఇంతకుముందు ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'అరవింద సమేత' సినిమాకి అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆయనకి కుదరలేదు. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాకి అనిరుధ్ సెట్ అయ్యాడు. ఆల్రెడీ మ్యూజిక్ సిటింగ్స్ జరిగిపోతున్నాయి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నట్టు చెబుతున్నారు. ఒక బస్తీ నుంచి కాలేజ్ కి వచ్చిన ఆయన, అక్కడ జరుగుతున్న అన్యాయాలకు తిరుగుబాటు శంఖం పూరిస్తాడట. బస్తీ విద్యార్థుల హక్కులను కాపాడటానికి కొందరు రాజకీయ నాయకులను ఎదిరించి పోరాడతాడని అంటున్నారు. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ కథ కొరటాల మార్క్ తోనే నడుస్తుందట. ఈ సినిమాలోను సందేశం ఉంటుందని అంటున్నారు. త్వరాలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు.