Begin typing your search above and press return to search.

భారీ ఛాన్స్ కోసం దీపికతో పోటీ పడుతున్న అలియా

By:  Tupaki Desk   |   21 Nov 2021 4:44 PM GMT
భారీ ఛాన్స్ కోసం దీపికతో పోటీ పడుతున్న అలియా
X
సినిమా చూసిన ప్రేక్షకుడు బాగుంది .. బాగోలేదు .. ఈ రెండింటిలో ఏదో ఒక ముక్క చెప్పేసి తాపీగా తన పని తాను చేసుకుపోతుంటాడు. కానీ ఆ ప్రేక్షకుడితో 'బాగుంది' అని చెప్పించడానికి ఎంతమంది వెయిట్ చేస్తుంటారనేది ఆ ప్రేక్షకుడికి కూడా తెలియదు. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే హీరో హీరోయిన్లు, సినిమా విడుదల రోజున లంఖణాలు చేసినంతగా టెన్షన్ పడిపోతారు. ఆ కాసేపు ఫోన్ రింగ్ అయినా ఏ వార్త వినవలసి వస్తుందో అన్నట్టుగా ఉలిక్కిపడతారు. ఒక సినిమా హిట్ అయితే పది సినిమాలు వస్తాయి. లేదంటే చర్చల దశలో ఉన్న ప్రాజెక్టులు వెనక్కి వెళ్లిపోతాయి .. అందుకే అంత టెన్షన్.

సినిమా అనేది కోట్ల రూపాయల బిజినెస్ .. ఇక్కడ మొహమాటాలకీ .. త్యాగాలకు అవకాశమే ఉండదు. ఒక అవకాశం చేతివరకూ రావడం .. సెట్స్ వరకూ వెళ్లడం ఇక్కడ అంత తేలికగా జరగదు. ఏ క్షణంలో ఏ మార్పు చోటుచేసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఒక భారీ ప్రాజెక్ట్ మొదలవుతుందంటే, ఆ దర్శక నిర్మాతలతో పరిచయమున్నవారంతా అందులో అవకాశం కోసం ట్రై చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం అలా ఒక భారీ ప్రాజెక్టు కోసం ఒక వైపు నుంచి దీపికా పదుకొనే .. మరో వైపు నుంచి అలియా భట్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ఇద్దరూ పోటీపడుతున్నారంటేనే అది చిన్నా చితకా సినిమా కాదనే విషయం ఈ పాటికే అర్థమైపోయే ఉంటుంది. అవును .. అది సంజయ్ లీలా భన్సాలీ సినిమా. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఆయన పేరు ముందువరుసలో కనిపిస్తుంది. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలను తీర్చిదిద్దే విధానం కొత్తగా ఉంటుంది. బలమైన కథాకథనాలకు తోడు భారీతనం ఆ సినిమాలకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుంటుంది. అలాంటి భన్సాలీ తాజాగా 'బైజు బావ్రా' అనే ఒక సినిమాను చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి.

ఇంతకుముందు ఆయన రణ్ వీర్ సింగ్ - దీపిక కాంబినేషన్లో రామ్ లీలా .. పద్మావత్ .. బాజీరావ్ మస్తాని సినిమాలు చేశారు. అలాగే అలియాతో 'గంగూబాయి కథియావాడి' సినిమా తెరకెక్కించారు. తాజా చిత్రమైన 'బైజు బావ్రా' సినిమాలో కథానాయకుడిగా ఆయన రణ్ వీర్ ను తీసుకున్నారు. ఇక కథానాయిక పాత్ర కోసం ఇటు దీపిక .. అటు అలియా పోటీ పడుతున్నారు. అలియా మరో అడుగు ముందుకు వేసి, తనకి పారితోషికమే వద్దని అంటోందట. భన్సాలీ కూడా ఆమె వైపే మొగ్గు చూపుతున్నాడని అంటున్నారు. చూడాలి మరి .. ఏం జరుగుతుందో!