Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా ఆలియాని వ‌ద‌ల‌ బొమ్మాళీ

By:  Tupaki Desk   |   19 Sep 2021 11:30 PM GMT
పాన్ ఇండియా ఆలియాని వ‌ద‌ల‌ బొమ్మాళీ
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా క్రేజ్ గురించి తెలిసిందే. ఉత్త‌రాదినే కాదు ద‌క్షిణాదినా ప్ర‌స్తుతం ఆలియా పేరు మార్మోగుతోంది. ఆర్.ఆర్.ఆర్ స్టార్ ఆలియా అంటూ తెలుగు-త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ పెరిగింది. ఇరు ప‌రిశ్ర‌మ‌ల్లో అగ్ర‌క‌థానాయ‌కుల క‌న్ను ఆలియాపైనే ఉందిప్పుడు. త‌న‌ని ఎంపిక చేస్తే అది త‌మ‌కు పాన్ ఇండియా మార్కెట్లో వ‌ర్క‌వుట‌వుతుంద‌నేది అంద‌రి ఆలోచ‌న‌. దీంతో ఆలియాకు ఊపిరాడ‌న‌న్ని అవ‌కాశాలు వెంట‌ప‌డుతున్నాయి.

బాలీవుడ్ లో అత్యంత ప్రతిభావంతురాలైన కథానాయికలలో అలియా భట్ అత్యంత భారీ పారితోషికం అందుకుంటున్నా ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. ఆర్.ఆర్.ఆర్ లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించిన ఆలియాను త‌మ సినిమాల‌కు ఒప్పించేందుకు ఎన్టీఆర్ .. మ‌హేష్‌.. లాంటి స్టార్లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల భారీ మల్టీ స్టారర్ RRR తో అలియా టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు (చ‌ర‌ణ్‌) ప్రియురాలు సీత‌గా ఆలియా క‌నిపించ‌నుంది.

ఈ సినిమా త‌ర్వాత ఆలియా క్రేజు సౌత్ లో అమాంతం పెర‌గ‌నుంది. అందుకే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ .. ఎన్టీఆర్ తదుపరి చిత్రం కోసం అలియా భట్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. శివ ఇటీవల ఆలియాను కలుసుకుని స్క్రిప్ట్ వినిపించారు. సినిమాలో ఆలియాకు త‌న‌ పాత్ర న‌చ్చింద‌ట‌. అయితే ఇప్పటికీ బిజీ షెడ్యూళ్ల‌తో ఉన్నందున ఆమె ఇంకా ఈ చిత్రానికి సంతకం చేయలేదు. సంతకం చేశాకే దీని గురించి అధికారిక ప్రకటన వెలువ‌డ‌నుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొంద‌నుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ .. కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ఆలియా అంటే అంద‌రికీ మోజేల‌? చూస్తుంటే టాలీవుడ్ ఇప్ప‌ట్లో ఆలియాని వ‌దిలేట్టు లేదు.

తెలుగు భాష నేర్చుకున్న ఆలియా

ఇటీవ‌ల టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ నటీమణులు శ్ర‌ద్ధా క‌పూర్ -ఆలియా భట్ - కృతి సనోన్ తెలుగు నేర్చుకునేందుకు శిక్ష‌కుల‌ను ఏర్పాటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆలియా తెలుగులో ఎంట్రీ ఇస్తూ ఇప్పుడు తెలుగు భాష‌పై ప‌ట్టు సంపాదించేందుకు ప్ర‌య‌త్నిస్తోందంటే మునుముందు ఇక్క‌డ భారీ ప్లానింగ్ తో ఉంద‌ని భావించాల్సిందే.

పెళ్లి ఇప్ప‌ట్లో లేన‌ట్టేనా?

బాలీవుడ్ ప్రేమ జంట ర‌ణ‌బీర్ క‌పూర్ - ఆలియా భ‌ట్ పెళ్లెప్పుడు? ఈ ప్ర‌శ్న‌కు ఇన్నాళ్లు స‌రైన ఆన్స‌ర్ లేదు. 2020లో ఒక ఇంటర్వ్యూలో, రణబీర్ కపూర్ కరోనావైరస్ మహమ్మారి దేశాన్ని తాకక‌పోతే తాను అలియా భట్ ని పెళ్లాడేవాడిన‌ని ధృవీకరించాడు. రణబీర్ కపూర్ ప్రకటన తో ఇక ఈ వివాహం ఫిక్స‌యిన‌ట్టేన‌ని భావించారు. కానీ సరైన సమయం కోసం చూస్తున్నార‌ని అంద‌రికీ అర్థ‌మైంది. తాజాగా బెల్ బాట‌మ్ ఫేం లారా దత్తా ఈ జంట వివాహంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను చేశారు. ఈ సంవత్సరం ఈ జంట పెళ్లి చేసుకుంటుందని నమ్ముతున్నాను అంటూ వ్యాఖ్యానించారు. రణబీర్ రాజీవ్ మసంద్ తో ఇంటర్వ్యూలో అలియాతో తన వివాహ ప్రణాళికల గురించి మాట్లాడిన సంగ‌తి తెలిసిన‌దే. ఆలియాను 2020 లో వివాహం చేసుకోబోతున్నాన‌ని అయితే అప్పుడు కోవిడ్ -19 వ‌ల్ల ప్లాన్ మారింద‌ని తెలిపారు . నా జీవితంలో చాలా త్వరగా ఆ లక్ష్యాన్ని చేరుకుంటాన‌ని ర‌ణ‌బీర్ అన్నారు. అయితే ఆలియా క‌మిట్ మెంట్ల‌ను చూస్తుంటే ఇప్ప‌ట్లో పెళ్లి ఆలోచ‌న ఉన్న‌ట్టు కనిపించ‌డం లేదు.

ఇత‌ర సినిమాల‌ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అలియా - రణ్ బీర్ మొదటిసారి బ్రహ్మాస్త్రలో స్క్రీన్ స్పేస్ ను పంచుకుంటున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్- మౌని రాయ్ -నాగార్జున కీలక పాత్రలు పోషించారు. ఆలియా త‌దుప‌రి గంగుబాయ్ కథియావాడి చిత్రంలో న‌టిస్తోంది. డార్లింగ్స్ - రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.