Begin typing your search above and press return to search.

తెలుగు డబ్బింగ్ కోసం తంటాలు పడుతున్న బాలీవుడ్ 'సీత'..!

By:  Tupaki Desk   |   24 Dec 2020 1:32 PM IST
తెలుగు డబ్బింగ్ కోసం తంటాలు పడుతున్న బాలీవుడ్ సీత..!
X
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'కొమురం భీమ్' పాత్రలో నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు'గా కనిపించనున్నాడు. ఇందులో అలియా చరణ్‌ కు జోడిగా 'సీత' పాత్రలో నటిస్తుండగా.. తారక్ సరసన ఐరిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఇటీవలే 'ఆర్.ఆర్.ఆర్' షూట్ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఆలియా కూడా టీమ్ తో జాయిన్ అయింది. హైదరాబాద్ షెడ్యూల్ లో అలియా పాల్గొనే కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు.

అయితే 'ఆర్.ఆర్.ఆర్' ఆలియాకు మొదటి తెలుగు సినిమా అయినప్పటికీ.. తన పాత్రకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోడానికి ట్రై చేస్తోందని తెలుస్తోంది. ఇందుకోసం అమ్మడు స్పెషల్ క్లాసులను తీసుకుంటూ తెలుగు ఉచ్చారణ కోసం తంటాలు పడుతోందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అలియా.. చాలా కాలంగా తెలుగు డైలాగులను వల్లె వేస్తున్నానని.. ఈ ఎక్సపీరియన్స్ చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పుకొచ్చిందట. ఏదేమైనా అలియా టాలీవుడ్ లో సాలిడ్ డెబ్యూ ఇవ్వనుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అలానే బాలీవుడ్ లో ఈ మధ్య ఆమెపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వస్తుందని భావిస్తున్నారు.