Begin typing your search above and press return to search.

హిందీ సినిమాల‌ను చెత్త బుట్ట‌లో వేయ‌కండి!

By:  Tupaki Desk   |   4 Aug 2022 2:30 AM GMT
హిందీ సినిమాల‌ను చెత్త బుట్ట‌లో వేయ‌కండి!
X
బాలీవుడ్ స‌క్సెస్ రేస్ లో వెన‌క‌బ‌డింద‌న్న ఆందోళ‌న ఎక్కువైంది. ముఖ్యంగా హిందీ ఫిలింమేక‌ర్స్ లో స్టార్ల‌లో ఇది ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఒకదాని తర్వాత ఒకటిగా హిందీ చిత్రాలు ఫ్లాప‌వుతున్న తీరు ముంబై ఇండస్ట్రీ వర్గాలను కుదిపేస్తోంది. ఆస‌క్తిక‌రంగా ముంబై మీడియా సౌతం సౌత్ ప్రాజెక్ట్ లను హైప్ చేస్తూ గుబులు పుట్టిస్తోంది. హిందీ చిత్రాలను పదే పదే ఎగ‌తాళి చేయ‌డం చాలా మంది ఉత్త‌రాది ప్ర‌జ‌ల‌కు బాధ కలిగిస్తోంది.

దీనిపై ఆర్.ఆర్.ఆర్ సీత కామెంట్ ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మాట్లాడుతూ.. హిందీ సినిమాలపై దయ చూపాల‌ని రిలీజైన‌ వెంటనే వాటిని చెత్తబుట్టలో వేయవద్దని మీడియాను కోరింది. ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది ఒక దశ మాత్రమేనని.. భారీ తారలతో పెద్ద సినిమాలు వచ్చి ప్రేక్షకులను అలరించిన తర్వాత పరిస్థితులు చక్కబడతాయని కూడా ఆలియా ఆశాభావం వ్య‌క్తం చేసింది.

డెలివరీ తర్వాత సినిమాలకు లైట్?

స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ ని పెళ్లాడిన ఆలియా భట్ త‌న తొలి బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లుకుతున్న సంగ‌తి విధిత‌మే. ఇలాంటి స్థితిలోనూ నెట్ ఫ్లిక్స్ లో త్వరలో విడుదల కానున్న తన కొత్త చిత్రం డార్లింగ్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. గర్భం దాల్చిన తర్వాత సినిమాలకు గ్యాప్ తీసుకుంటారా? అని ప్ర‌శ్నించ‌గా.. తన డెలివరీ తర్వాత ఎక్కువ గ్యాప్ ఉండదని.. మాతృత్వం కోసం సినిమాలను వదిలిపెట్టనని అలియా చెప్పింది. అలియా ప్రస్తుతం దేశంలోనే క్రేజీ స్టార్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం కొన్ని పెద్ద సినిమాల్లో నటిస్తోంది. ఇవ‌న్నీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.

ఆలియా 2022లో రెండు పాన్ ఇండియా హిట్లు అందుకుంది. ఒక‌టి ఆర్.ఆర్.ఆర్ కాగా రెండోది గంగూభాయి క‌తియావాడీ. ఇవి రెండూ భారీ వ‌సూళ్ల‌తో పాటు ఆలియాకు చ‌క్క‌ని పేరు తెచ్చాయి. త‌దుప‌రి ఇదే ఏడాదిలో బ్ర‌హ్మాస్త్ర లాంటి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. గ‌ర్భ‌ధార‌ణ‌కు ముందే ఆలియా పెండింగ్ అసైన్ మెంట్ లన్నింటినీ పూర్తి చేసింది.

కరణ్ జోహార్ దర్శకత్వంలో ఆమె తన కొత్త చిత్రం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రీక‌ర‌ణ‌ను ఇటీవ‌లే పూర్తి చేసింది. `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ`కి సంబంధించి తన టాకీ పార్ట్ ను ముగించింది. ఒక్క పాట మిన‌హా టాకీ మొత్తం పూర్త‌యింది. ఆలియా డెలివరీ తర్వాత ఈ పాట‌ను చిత్రీక‌రిస్తారు. ఈ చిత్రంలో అనన్య పాండే- జాన్వీ కపూర్- సారా అలీ ఖాన్ అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. ర‌ణ‌బీర్ తో క‌లిసి న‌టించిన బ్ర‌హ్మాస్త్ర పార్ట్ 1 త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

డార్లింగ్స్ తో నిర్మాత‌గా ప‌రిచ‌యం

ఆలియా భ‌ట్- షెఫాలీ షా- విజయ్ వర్మ త‌దిత‌రులు న‌టించిన‌ డార్క్ కామెడీ మూవీ డార్లింగ్స్. ఈ చిత్రాన్ని గౌరీ ఖాన్- అలియా భట్ -గౌరవ్ వర్మ నిర్మించారు. ఆలియాకి నిర్మాత‌గా ఇది తొలి సినిమా. జస్మీత్ కె రీన్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. డార్లింగ్స్ టీజర్ పోస్టర్ ల‌తో పాటు ట్రైలర్ ఆక‌ట్టుకుంది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో 2022 ఆగస్టు 5న ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది.