Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'అల వైకుంఠపురములో'

By:  Tupaki Desk   |   12 Jan 2020 7:32 AM GMT
మూవీ రివ్యూ: అల వైకుంఠపురములో
X
చిత్రం : 'అల వైకుంఠపురములో'

నటీనటులు: అల్లు అర్జున్ - పూజా హెగ్డే - మురళీ శర్మ - జయరాం - టబు - సచిన్ ఖేద్కర్ - సుశాంత్ - నివేథా పెతురాజ్ - సముద్రఖని - జీపీ - వెన్నెల కిషోర్ - రాజేంద్రప్రసాద్ - సునీల్ - హర్షవర్ధన్ - ఈశ్వరి రావు - రోహిణి - నవదీప్ - రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్
నిర్మాతలు: అల్లు అరవింద్ - సూర్యదేవర రాధాకృష్ణ
రచన - దర్శకత్వం: త్రివిక్రమ్

‘నా పేరు సూర్య’తో కంగుతిన్న అల్లు అర్జున్.. కెరీర్లో బాగా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ‘అల వైకుంఠపురములో’. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత అతను త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ఈ రోజే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఆ అంచనాల్ని ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

వాల్మీకి (మురళీ శర్మ) ఒక మధ్య తరగతి జీవి. ఐతే తాను పని చేసే సంస్థలో తనలాగే క్లర్కుగా ఉన్న రామచంద్ర (జయరాం) దాని యజమాని కూతురిని పెళ్లాడి పెద్ద స్థాయికి చేరిపోయాడన్న అక్కసుతో అతడికి పుట్టిన కొడుకు స్థానంలో తన కొడుకును పెట్టేసి అతడి కొడుకును తన కొడుకుగా పెంచుతాడు. వాల్మీకి దగ్గర పెరిగిన కొడుకు కాని కొడుకు బంటు (అల్లు అర్జున్).. చిన్నతనం నుంచి తన పట్ల అస్సలు ప్రేమ చూపించని తండ్రితో వేగి వేగి చివరికి ఒక సంస్థలో ఉద్యోగం సంపాదించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటాడు. అతను పరిస్థితుల ప్రభావం వల్ల తన అసలు తండ్రి ఇంటికే చేరుతాడు. అక్కడి సమస్యల్ని తీర్చే పనిలో పడతాడు. అక్కడ అతడికి ఎదురైన అనుభవాలేంటి.. తన పుట్టుకకు సంబంధించిన అసలు నిజం అతడికి తెలిసిందా.. తెలిశాక అతనెలా స్పందించాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

తెలుగులో కుటుంబ కథా చిత్రాల్లో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చిన రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కుటుంబ కథా చిత్రాలంటే సెంటిమెంటే ప్రధానంగా సాగే రోజుల్లో.. త్రివిక్రమ్ వచ్చి ఈ కథల్ని ఎంత వినోదాత్మకంగా చెప్పొచ్చో చూపించాడు. రచయితగా ‘స్వయంవరం’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’.. దర్శకుడిగా ‘అతడు’, ‘అత్తారింటికి దారేది’, ‘అఆ’ లాంటి సినిమాల్లో చక్కటి వినోదం పండించి కుటుంబం అంటే ఆనందం, ఆహ్లాదం అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఐతే ఒక దశ దాటాక తిప్పి తిప్పి అవే కథల్ని చెబుతుంటే.. త్రివిక్రమ్ కూడా తాను మొదలుపెట్టిన ట్రెండులోనే చిక్కుకుపోయి త్రివిక్రమ్ కూడా ఒక మూసలో కొట్టుకుపోతున్నాడేమో అన్న భావన కలిగింది. ‘అజ్ఞాతవాసి’ చూశాక ఇక త్రివిక్రమ్ ఈ తరహా కుటుంబ కథల్ని పక్కన పెట్టేస్తే బాగుండన్న ఫీలింగ్ ప్రేక్షకులకు బలంగా కలిగింది. ఐతే తర్వాత ‘అరవింద సమేత’ లాంటి భిన్నమైన సినిమా చేసిన త్రివిక్రమ్.. ‘అల వైకుంఠపురములో’తో మళ్లీ తన జానర్లోకే వచ్చేశాడు.

ఈ సినిమా ప్రోమోలు చూస్తే మళ్లీ మరో ‘అజ్ఞాతవాసి’ తరహా కథ చెబుతున్నాడేంటా అన్న సందేహాలు కలిగాయి. ఐతే ఆ సందేహాలు నిజమే. త్రివిక్రమ్ మళ్లీ ‘అజ్ఞాతవాసి’ కథనే చెప్పాడు. కానీ అందులో మాదిరి నేల విడిచి సాము చేయలేదు. ఈసారి కథను అనుసరించి సాగాడు. తాను మనసుపెడితే కథ ప్రేక్షకుల్లో మనసుల్లోకి ఎలా చేరుతుందో.. కథనం ఎలా పరుగులు పెడుతుందో.. పాత్రలు ఎంత చక్కగా రూపుదిద్దుకుంటాయో.. సన్నివేశాలు ఎంతగా అలరిస్తాయో.. ఎంత అర్థవంతమైన డైలాగులు పడతాయో.. మొత్తంగా సినిమా ఎంత ఆహ్లాదంగా మారుతుందో ‘అల వైకుంఠపురములో’తో చూపించాడు. మొదట్లో అర్థవంతమైన కథలు చెప్పి.. ఆ తర్వాత కొన్ని ‘ప్యాకేజీ’ సినిమాలతో తన స్థాయిని కొంచెం తగ్గించుకున్న త్రివిక్రమ్ దర్శకుడిగా తన కెరీర్ మొత్తంలో సిన్సియర్ గా చేసిన సినిమాల్లో ఒకటిగా ‘అల వైకుంఠపురములో’ నిలుస్తుంది. భావోద్వేగాలకు భావోద్వేగాలు.. వినోదానికి వినోదం సమపాళ్లలో కుదిరి.. అదే సమయంలో ఏదీ శ్రుతి మించకుండా ప్రేక్షకులకు ఆహ్లాదం పంచుతుందీ చిత్రం.

‘అల వైకుంఠపురములో’లో ప్రధానంగా ఆకట్టుకునేది.. త్రివిక్రమ్ గత సినిమాలతో పోలిస్తే ఆశ్చర్యంగా అనిపించేది ‘సింప్లిసిటీ’. హీరోయిజం కావచ్చు.. రొమాన్స్ కావచ్చు.. కామెడీ కావచ్చు.. ఎమోషన్లు కావచ్చు.. ఏవీ కూడా అతిగా అనిపించవు. ఎక్కడా హడావుడి కనిపించదు. అన్నీ ‘సింపుల్’గానే ఉంటాయి. నెమ్మదిగా మనసులో లోతుల్లోకి వెళ్తాయి. కామెడీ కోసమని అహజమైన సన్నివేశాలు.. బలవంతంగా ఇరికించిన డైలాగులు.. ప్రాసలు వంటివి త్రివిక్రమ్ ఈ సినిమాకు పక్కన పెట్టేశాడు. అలాగే ఎమోషనల్ సీన్లలో అనవసర ‘క్లాసులు’ కూడా తగ్గించేశాడు. కథకు తగ్గ సన్నివేశాలు.. వాటికి తగ్గ డైలాగులతో సినిమా ఆహ్లాదంగా నడిచిపోతుంది. ఒకప్పటి త్రివిక్రమ్ సినిమాల్లో మాదిరి ఇందులో పేలిపోయే కామెడీ లేకపోవడం ఒకింత నిరాశ కలిగించేదే. కానీ ఉన్నంతలో వినోదానికి ఢోకా లేదు.

త్రివిక్రమ్ ఈసారి కథను అనుసరించి సాగబోతున్నాడని ‘అల వైకుంఠపురములో’ ఆరంభమైన తీరుతోనే స్పష్టం అయిపోతుంది. కథలోని కీలక మలుపుతో ఈ సినిమా మొదలవుతుంది. ఆ మలుపు కారణంగా ఈ కథ ఎలా సాగుతుందనే క్యూరియాసిటీ మొదలవుతుంది. ఐతే ఫ్లాష్ బ్యాక్ నుంచి వర్తమానంలోకి వచ్చాక త్రివిక్రమ్ తన స్టయిల్లోకి వచ్చేశాడు. ఎంట్రీ దగ్గర్నుంచి హీరో పాత్ర అలరిస్తుంది. త్రివిక్రమ్ కలం బలానికి తన పెర్ఫామెన్స్ కూడా జోడించి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తాడు బన్నీ. హీరో పాత్రతో ప్రేక్షకులు చాలా ఈజీగా కనెక్టయ్యేలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. మురళీ శర్మ, బన్నీ పాత్రల మధ్య కెమిస్ట్రీ పండటంతో వాళ్ల మధ్య సన్నివేశాలు అలరిస్తాయి. ఆపై హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ లో లోతు లేకపోయినా.. అది కూడా సరదాగా సాగుతుంది. మధ్యలో కథనం కొంచెం నెమ్మదించినా.. ఇంటర్వెల్ ముంగిట మలుపు.. దానికి సంబంధించిన డ్రామా ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తాయి.

ద్వితీయార్ధంలో హీరో వైకుంఠపురంలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి కథ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే సాగినా.. ఎంటర్టైన్మెంట్ మాత్రం మరో స్థాయికి చేరుతుంది. బోర్డ్ రూం మీటింగుకి వెళ్లి బన్నీ చేసే అల్లరి సినిమాకు మేజర్ హైలైట్లలో ఒకటి. పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్.. మహేష్ బాబు లాంటి స్టార్ల పాటలకు బన్నీ డ్యాన్స్ చేయడం యువ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుంది. విలన్ అడ్డాకు వెళ్లి హీరో తన సత్తా చూపించే ఎపిసోడ్ మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. కుటుంబంలో అరమరికల్నీ తీర్చేసే వైనం.. కొంత రొటీన్ గా సాగినా.. అందులోని భావోద్వేగాలకు ప్రేక్షకులు కనెక్టవుతారు. ఒక పాట బ్యాక్ డ్రాప్ లో చాలా సరదాగా సాగిపోయే క్లైమాక్స్ ఫైట్ త్రివిక్రమ్ మళ్లీ పతాక స్థాయి ఫామ్ అందుకున్నాడనే సంకేతాలు ఇస్తుంది. అతడి ఆత్మవిశ్వాసాన్ని కూడా తెలియజేస్తుంది. ఐతే పతాక సన్నివేశంలో మాత్రం భావోద్వేగాలు అనుకున్న స్థాయిలో పండలేదు. ‘అత్తారింటికి దారేది’ తరహా పతాక సన్నివేశాన్ని ఆశిస్తే.. ఎమోషన్ల డోస్ తగ్గించి సినిమాను సాధారణంగా ముగించాడు త్రివిక్రమ్.

ఐతే ఎండ్ టైటిల్స్ దగ్గర తన మార్కు చమత్కారంతో ప్రేక్షకులు నవ్వుతూ థియేటర్ల నుంచి బయటికి వెళ్లేలా చేశాడు త్రివిక్రమ్. ఒక ఫ్యామిలీలోకి హీరో అడుగుపెట్టి అక్కడ సమస్యలన్నీ తీర్చే లైన్ ఇంతకుముందు ‘అత్తారింటికి దారేది’ సహా త్రివిక్రమ్ సినిమాల్లో చూసిందే కావడంతో ఈ సినిమాలో కొన్ని సీన్లు రిపిటీటివ్‌ గా అనిపించడం సినిమాలో ఒక మైనస్. మరీ క్లాస్ గా సాగే నరేషన్ కారణంగా మాస్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారన్న సందేహాలు కలుగుతాయి కానీ.. మిగతా ప్రేక్షకులను మాత్రం ‘అల వైకుంఠపురములో’ పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేస్తుంది. త్రివిక్రమ్ ఆల్ టైం హిట్ ‘అత్తారింటికి దారేది’ తరహాలోనే సాగే ఈ చిత్రం కామెడీలో, ఎమోషన్లలో ఆ స్థాయి ‘హై’ ఇవ్వకపోయినా.. ప్రేక్షకుల్ని ఆద్యంతం ఎంగేజ్ చేసే వినోదానికి మాత్రం ఇందులో ఢోకా లేదు.

నటీనటులు:

పెర్ఫామెన్స్ పరంగా అల్లు అర్జున్ కెరీర్లో ఒకానొక అత్యుత్తమ పాత్రగా ఇది నిలుస్తుంది. అతనన్నట్లే చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన పాత్ర ఇదని సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎక్కడా ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా.. సింపుల్ గా తన పాత్రను చేసుకుపోయాడు అల్లు అర్జున్. నిజానికి బన్నీ సరదా పాత్రల్లో కనిపిస్తే ఎక్కువమందికి నచ్చుతాడు. సినిమాలో చాలా వరకు తన పాత్ర అలాగే సాగుతుంది. ఒకట్రెండు ఎమోషనల్ సీన్లలో కూడా బాగా చేశాడు. అభిమానుల్ని కొన్ని సన్నివేశాల్లో ఉర్రూతలూగించేలా బన్నీ పెర్ఫామ్ చేశాడు. ఇగో లేకుండా వేరే హీరోల పాటలకు స్టెప్పులేసి మార్కులు కొట్టేశాడు. అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ పరంగా ఎక్కువ స్కోర్ చేసేది మురళీ శర్మే. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో టిపికల్ మేనరిజంతో మురళీ శర్మ కట్టి పడేశాడు. ఆ పాత్రను చూస్తేనే ప్రేక్షకులు ఫ్రస్టేట్ అయి ఒకటి పీకాలన్న ఫీలింగ్ వచ్చేంతగా అతను తన పాత్రను పండించాడు. హీరోయిన్ పూజా హెగ్డే అందంతో ఆకట్టుకుంది. మొదట్లో ఆమె పాత్ర బాగానే అనిపించినా తర్వాత తేలిపోయింది. రామచంద్ర పాత్రలో జయరాం హుందాగా నటించాడు. టబు పాత్రకు అనుకున్నంత ప్రాధాన్యం లేదు కానీ.. ఆమె కూడా ఉన్నంతలో బాగానే చేసింది. సుశాంత్ చాలా వరకు ఎందుకీ పాత్ర చేశాడో అనిపిస్తుంది కానీ.. చివర్లో ఆ పాత్ర ఓకే అనిపిస్తుంది. ఆ పాత్రకు అతను సరిపోయాడు. విలన్లుగా సముద్రఖని, జీపీ ఓకే అనిపించారు. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ తక్కువ సన్నివేశాల్లోనే నవ్వించారు. సునీల్.. నివేథా పెతురాజ్ గురించి చెప్పడానికేమీ లేదు. హర్షవర్ధన్ బాగా చేశాడు.

సాంకేతికవర్గం:

సాంకేతికంగా ‘అల వైకుంఠపురములో’లో ఉన్నత ప్రమాణాలు కనిపిస్తాయి. తమన్ కెరీర్లోనే పాటలు, నేపథ్య సంగీతం పరంగా ‘ది బెస్ట్’గా నిలవడానికి ఈ సినిమా పోటీలో ఉంటుంది. సినిమాలో ప్రతి పాటా హాయిగా, ఆహ్లాదంగా అనిపిస్తాయి. ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మా’ వినడానికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో.. తెరమీద కూడా అంతే బాగా అనిపిస్తాయి. రాములో రాములా కూడా అలరిస్తుంది. మిగతా పాటలూ బాగున్నాయి. నేపథ్య సంగీతంతోనూ తమన్ ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్ సినిమాలో ఆహ్లాదం పెంచడంలో తన వంతు పాత్ర పోషించాడు. విజువల్స్ కంటికి ఇంపుగా అనిపిస్తాయి. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీతనం లేదు. సినిమా చాలా రిచ్ గా కనిపిస్తుంది. ఇక దర్శకుడు త్రివిక్రమ్ విషయానికొస్తే.. ఆయన మనసు పెట్టి చేసిన సినిమా ఇదనిపిస్తుంది. నేలవిడిచి సాము చేయకుండా ఒక కథను పద్ధతిగా చెప్పాడాయన. ఆయనలోని రచయితకు, దర్శకుడికి మధ్య ఈసారి సమన్వయం.. రాతలో, తీతలో సమతూకం కనిపిస్తుంది. ఆయనలోని రచయిత ఈసారి బాగా నియంత్రణలో ఉన్నాడు. కథకు అవసరమైన సన్నివేశాలు, డైలాగులతో కచ్చితత్వం పాటించాడు త్రివిక్రమ్. ఓవరాల్ గా త్రివిక్రమ్ చాలా కాలం తర్వాత తన అభిమానుల్ని పూర్తి స్థాయిలో మెప్పించే సినిమా తీశాడు.

చివరగా: అల వైకుంఠపురములో.. వినోదాల విందు

రేటింగ్-3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre