Begin typing your search above and press return to search.

పవన్‌ ఫ్లాప్ మూవీ సూపర్‌ స్టార్‌ రీమేక్‌

By:  Tupaki Desk   |   16 Feb 2021 12:00 PM IST
పవన్‌ ఫ్లాప్ మూవీ సూపర్‌ స్టార్‌ రీమేక్‌
X
పవన్‌ కళ్యాణ్‌ నటించిన 'కాటమరాయుడు' సినిమా నిరాశ పర్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమా ప్రేక్షకులతో పాటు అభిమానులను కూడా నిరాశ పర్చింది. పవన్‌ కు జోడీగా కాటమరాయుడు సినిమాలో శృతి హాసన్‌ నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఒరిజినల్‌ వర్షన్‌ వీరం మాత్రం తమిళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శౌర్యం శివ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా రూపొందిన ఆ సినిమా తమిళ సినీ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంది కాని తెలుగులో మాత్రం కాటమరాయుడుగా మెప్పించలేక పోయింది. కొన్ని తమిళ సూపర్‌ హిట్‌ సినిమాలు తెలుగులో సక్సెస్‌ కాలేక పోయాయి. కాని ఉత్తరాదిన మాత్రం ఆకట్టుకున్నాయి. అందుకే వీరం సినిమాను కూడా ఉత్తరాదికి తీసుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు.

తెలుగులో కాటమరాయుడు చేస్తున్న సమయంలోనే బాలీవుడ్‌ లో అక్షయ్‌ కుమార్‌ హీరోగా 'ల్యాండ్‌ ఆఫ్‌ లుంగి' పేరుతో రీమేక్‌ చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. కాటమరాయుడు ఎఫెక్ట్‌ ఏమైనా పడిందా లేదా మరే ఇతర కారణమో కాని అక్షయ్‌ కి ల్యాండ్‌ ఆఫ్‌ లుంగి సినిమాపై ఆసక్తి కలుగలేదు. అక్షయ్‌ వద్ద నుండి సల్మాన్‌ ఖాన్ వద్దకు ఆ సినిమా చేతులు మారింది. గత ఏడాదిలో కబీ ఈద్‌ కబీ దివాలి టైటిల్‌ తో సల్మాన్ సినిమాను ప్రకటించారు. ఆ సమయంలో అది వీరం సినిమా కు రీమేక్ అనలేదు. కాని ఇప్పుడు సల్మాన్ హీరోగా ఫర్హద్ సామ్‌జీ దర్శకత్వంలో రూపొందబోతున్న కబీ ఈద్‌ కబీ దివాలి సినిమా వీరం సినిమాకు రీమేక్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. కేవలం స్టోరీ లైన్ తీసుకుని మొత్తం సినిమాను మార్చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం సల్మాన్ చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాదిలో ఈ రీమేక్ పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు.