Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: 'అఖిల విశ్వాన్ని శాసించే ఆదిశక్తి అక్షరమే' అని చాటిచెప్పే ''అక్షర''..!
By: Tupaki Desk | 16 Feb 2021 5:27 PM ISTనందితా శ్వేత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''అక్షర''. ఓ సెన్సిటివ్ ఇష్యూని తీసుకుని డైరెక్టర్ బి. చిన్ని కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై సురేష్ వర్మ అల్లూరి - అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ - టీజర్ - సాంగ్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదల కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో 'అక్షర' ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంచ్ చేశారు.
'విద్యని నమ్మినవాడు విజ్ఞాని అవుతాడు.. విద్యని అమ్మినవాడు జ్ఞానాగ్నిలో దహించుకు పోతాడు.. అఖిల విశ్వాన్ని శాసించే ఆదిశక్తి అక్షరమే..' అనే వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అయింది. పోటీ ప్రపంచంలో విద్యార్థులు ర్యాంకుల వెనుక పరిగెడుతున్నారనే విషయం తెలిసిందే. పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని అర్ధాంతరంగా వారి జీవితాలను ముగిస్తున్నారు. అదే సమయంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ కోరుకునే పేద విద్యార్థులను కార్పొరేట్ మాఫియా చంపుతోంది. ఇలాంటి సంఘటనల నుండి ప్రేరణ పొంది ‘అక్షర’ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
ట్రైలర్ లో ఓ ప్రముఖ కాలేజీ విద్యార్థి మరణించడం.. పోలీసులు కేసును దర్యాప్తు చేయడం.. ఎడ్యుకేషన్ అనేది పౌరుడి హక్కు అనేది తెలియజేశారు. ఇందులో నందిత శ్వేత 'అక్షర' అనే ఫిజిక్స్ లెక్చరర్ గా నటించింది. 'చదువు అన్నది ఈ దేశంలో అందరి ప్రాథమిక హక్కు.. దాన్ని డబ్బుతో కొనుక్కోవడం తప్పు' 'భూమిని నమ్ముకున్నవాడు రైతు.. చదువుని నమ్ముకున్నవాడు రాజు' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దీనికి సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. దర్శకుడు త్రివిక్రమ్ ఆవిష్కరించిన ఈ ట్రైలర్ మంచి డైలాగ్స్ తో నిండి అన్ని వర్గాల వారిని అలరిస్తోంది. ఈ చిత్రంలో శత్రువు - సత్య - మధునందన్ - షకలక శంకర్ - శ్రీ తేజ - అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. మెసేజ్ తో కూడిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని ఈ నెల 26న రిలీజ్ చేస్తున్నారు.
