Begin typing your search above and press return to search.

'అహం రీబూట్' ప్రీ-లుక్: ఆర్జే గా మారిన అక్కినేని హీరో..!

By:  Tupaki Desk   |   15 Nov 2021 4:30 PM GMT
అహం రీబూట్ ప్రీ-లుక్: ఆర్జే గా మారిన అక్కినేని హీరో..!
X
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన సుమంత్.. కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన కథాంశాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 'మళ్ళీరావా' తర్వాత సుమంత్ ఆ స్థాయి విజయం అందుకోలేకపోయారు. ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని గట్టిగా ట్రై చేస్తున్న సుమంత్.. 'మళ్ళీ మొదలైంది' 'అనగనగా ఒక రౌడీ' వంటి సినిమాలు పూర్తి చేశారు. ఈ క్రమంలో తాజాగా ''అహం రీబూట్'' అనే మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చారు.

''అహం రీబూట్'' సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దర్శకులు చందు మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. శరణ్ కొప్పిశెట్టి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి - సృజన్ యరబోలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

''అహం రీబూట్'' సినిమాలో సుమంత్ ఒక రేడియో జాకీ (ఆర్జే) పాత్రలో కనిపించనున్నారు. ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సుమంత్ పాత్రకు తగ్గట్లుగా కాన్సెప్ట్ ను వివరిస్తున్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ సాగర్ తెలిపారు.

''అహం అంటే నేను.. అహం రీబూట్ అంటే సెల్ఫ్ రీబూట్. ఈగో, పొగరు, ద్వేషం లాంటి అర్థాలు కాకుండా అహం అంటే 'నేను' అనే విషయాన్ని ఈ సినిమాతో తెలిపే ప్రయత్నం చేస్తున్నాం'' అని దర్శకుడు వెల్లడించారు. శ్రీరామ్ మద్దూరి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వరుణ్ అంకర్ల సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ''అహం రీబూట్'' సినిమా.. సుమంత్ కు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.