Begin typing your search above and press return to search.

అఖిల్ మళ్లీ గాల్లోనే..

By:  Tupaki Desk   |   14 Nov 2017 10:47 AM GMT
అఖిల్ మళ్లీ గాల్లోనే..
X
ఏడాది నుంచి అక్కినేని అఖిల్ కాళ్లు నేల మీద నిలవట్లేదసలు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అతను నటిస్తున్న ‘హలో’ పూర్తి స్థాయి యాక్షన్ అడ్వెంచర్ లాగా ఉంది. ఈ చిత్ర టైటిల్ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన లుక్ కానీ.. ఫస్ట్ లుక్ పోస్టర్లో కానీ.. ఆ తర్వాత రిలీజ్ చేసి మరో లుక్‌లో కానీ అఖిల్ కాళ్లు నేల మీద లేవు. గాల్లోనే విన్యాసాలు చేస్తూ కనిపించాడతను. ఇప్పుడు ‘హలో’ టీజర్ రిలీజ్ గురించి సమాచారాన్ని వెల్లడిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. అందులోనూ గాల్లోనే దూసుకెళ్తున్నాడు అఖిల్. ఈ సినిమా ఎలా ఉండబోతోందో ఈ పోస్టర్లను బట్టే తెలుస్తోంది. ప్రతిసారీ ఒక కొత్త జానర్ టచ్ చేసే విక్రమ్ కుమార్ ఈసారి పూర్తి స్థాయి యాక్షన్ సినిమానే చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

‘హలో’ టీజర్ ఇంకో రెండు రోజుల్లో.. అంటే నవంబరు 16న విడుదలవుతుందట. ఈ టీజర్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందని.. నెవర్ బిఫోర్ అన్న తరహాలో దీన్ని తీర్చిదిద్దామని కాన్ఫిడెంటుగా చెబుతున్నాడు అఖిల్. టీజర్‌తో పాటుగానే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మరోసారి ధ్రువీకరించారు. ‘హలో’ వాయిదా పడొచ్చన్న రూమర్లకు తెర దించుతూ డిసెంబరు 22నే తాము ప్రేక్షకులకు ‘హలో’ చెప్పబోతున్నట్లు అఖిల్ మరోసారి కన్ఫమ్ చేశాడు. అక్కినేని నాగార్జున సైతం ఈ డేటే పక్కా అని చెప్పాడు. షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చిందని.. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తూనే ప్రమోషన్ కూడా గట్టిగా చేయబోతున్నామని నాగ్ చెప్పాడు. ఈ నెల 20 నుంచి పది రోజుల పాటు వర్మతో చేయబోయే సినిమా షెడ్యూల్ కానిచ్చి.. ఆ తర్వాత పూర్తిగా అఖిల్ సినిమా మీదే దృస్టిపెట్టబోతున్నాడు నాగ్.