Begin typing your search above and press return to search.

'తమ్ముడు' గా రాబోతున్న అఖిల్..?

By:  Tupaki Desk   |   12 July 2022 4:30 AM GMT
తమ్ముడు గా రాబోతున్న అఖిల్..?
X
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌' చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన యూత్ కింగ్ అఖిల్ అక్కినేని.. ప్రస్తుతం "ఏజెంట్" అనే స్పై థ్రిల్లర్ తో పాన్ ఇండియాని టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. అఖిల్ తన కొత్త చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

'వకీల్ సాబ్' ఫేమ్ వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో అఖిల్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య తో 'థాంక్యూ' సినిమాని నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇప్పుడు అతని సోదరుడితో మూవీ చేయడానికి రెడీ అయ్యారని టాక్ నడుస్తోంది.

ఇదే క్రమంలో అఖిల్ కోసం "తమ్ముడు" అనే టైటిల్ ను అనుకుంటున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే టైటిల్ తో పవన్ కళ్యాణ్ సినిమా ఉన్న సంగతి తెలిసిందే. 1999లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ పవన్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

అయితే ఇప్పుడు అదే 'తమ్ముడు' టైటిల్ తో అఖిల్ రాబోతున్నాడని అంటున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ సినిమా అన్నదమ్ముల కథతో వస్తే.. ఇక్కడ మాత్రం అక్కా తమ్ముళ్ల బంధం నేపథ్యంలో ఉంటుందని టాక్. అక్కినేని హీరో కోసం వేణు శ్రీరామ్ సెంటిమెంట్ మరియు యాక్షన్ తో కూడిన మంచి స్క్రిప్టును రెడీ చేసారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

గతంలో పవన్ కళ్యాణ్ 'తొలి ప్రేమ' టైటిల్ తో మెగా హీరో వరుణ్ తేజ్ సక్సెస్ అందుకున్నాడు. పీకే క్లాసిక్ మూవీ 'ఖుషి' టైటిల్ తో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో అఖిల్ 'తమ్ముడు' టైటిల్ తో వస్తున్నాడని టాక్ నడుస్తోంది. దీనిపై పవన్ అభిమానులు మరియు అక్కినేని ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

అఖిల్‌ 'అక్కినేని' వంటి స్టార్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. స్టార్ గా నిలదొక్కుకునే అన్ని లక్షణాలు తనకు ఉన్నాయని ఇప్పటికే ప్రూవ్ చేసాడు. 'ఏజెంట్' సినిమాతో టాప్ లీగ్ లో చేరుతాడని అభిమానులు భావిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ టైటిల్ తో వెళ్లడం సరైన నిర్ణయమేనా అని ఓ వర్గం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

అయితే టైటిల్ పెట్టుకున్నంత మాత్రాన పవన్ క్రేజ్ ఉపయోగించుకోవాలని అనుకున్నట్లు ఎలా అవుతుందని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. కథకు అలాంటి టైటిల్ బాగుంటుందని మేకర్స్ భావించి ఉండొచ్చు. అందులో తప్పేముందని అంటున్నారు. అసలు అఖిల్ 'తమ్ముడు' గా రాబోతున్నాడనే దాంట్లో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇకపోతే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న "ఏజెంట్" సినిమాకు సంబంధించిన టీజర్ జూలై 15న లాంచ్ కాబోతోంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది. అక్కినేని వారసుడికి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. దీని కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. మరి ఈ సినిమా అఖిల్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.