Begin typing your search above and press return to search.
ఆ రోజు అఖిల్ ఏం చేశాడు???
By: Tupaki Desk | 27 Sept 2015 3:10 PM ISTటాలీవుడ్ లో ఏ అరంగేట్ర హీరోకు లేనంత హైప్ వచ్చేసింది అఖిల్ కి. మొదట్నుంచి ఆ రేంజిలో ప్రమోట్ చేస్తున్నారు అక్కినేని కుర్రాడిని. బిజినెస్ కూడా దానికి తగ్గట్లే జరుగుతోంది. సినిమా విడుదలకు ఇంకా నెల రోజులు కూడా సమయం లేని నేపథ్యంలో అఖిల్ మరింత జోరు పెంచుతున్నాడు. టాలీవుడ్ చరిత్రలోనే ఎవరూ చేయని విధంగా అమెరికాకు వెళ్లి మరీ తన సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని జనాల్ని కూడా బాగానే ఎంగేజ్ చేస్తున్నాడు. తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు ఏం చేశానో చూపిస్తూ ఓ వీడియో రిలీజ్ చేయబోతున్నట్లు నిన్న ట్విట్టర్ లో ప్రకటించిన అఖిల్.. అన్నట్లే ఆ వీడియోను ఈ రోజు లాంచ్ చేశాడు.
‘అఖిల్’ ఆడియో ఫంక్షన్ రోజు ఉదయం లేచిన దగ్గర్నుంచి తానేం చేసింది చూపిస్తూ ఓ వీడియో తయారు చేయించాడు అఖిల్. ఉదయం 8.10కి ఇంటి దగ్గర్నుంచి బయల్దేరి ‘చిత్రాలయ’ డబ్బింగ్ స్టూడియోకు వెళ్లడం.. ‘అఖిల్’ ట్రైలర్ కోసం డబ్బింగ్ చెప్పడం.. ఆపై అన్నపూర్ణ స్టూడియోలో ‘అఖిల్’ ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగులో పాల్గొనడం.. తర్వాత సాయంత్రం ఇంటికెళ్లి ఆడియో ఫంక్షన్ కు తయారవడం.. చివరగా ఆడియో ఫంక్షన్ లోని మూమెంట్స్ ఇవన్నీ కలిపి.. తన వ్యాఖ్యానం జోడిస్తూ ఈ వీడియో పూర్తి చేశాడు అఖిల్. ఈ వీడియోతో మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు అఖిల్. తెలుగులో ఈ తరహా ప్రమోషన్ ఇంకెవరూ చేసి ఉండరేమో.