Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ లో 'అఖండ' రికార్డు జాతర

By:  Tupaki Desk   |   2 Dec 2021 11:30 AM GMT
ఓవర్సీస్ లో అఖండ రికార్డు జాతర
X
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రెండేళ్లుగా పెద్ద సినిమాలు ఒకటి రెండు మాత్రమే వచ్చినా అవి కరోనా భయంతో జనాలు ఉన్న సమయంలో థియేటర్ల వద్ద సందడి చేశాయి. ఆ సమయంలో వసూళ్లు లాంగ్‌ రన్ లో వచ్చినా ఓపెనింగ్‌ లో మాత్రం ఈ ఏడాదిలో అఖండను మించిన విజయం లేదని నిరూపితం అయ్యిందంటూ అభిమానులు అంటున్నారు. కరోనా కు ముందు ఓవర్సీస్ లో తెలుగు సినిమా లు భారీ ఎత్తున వసూళ్లు దక్కించుకున్న దాఖలాలు ఉన్నాయి. కాని కరోనా వల్ల ఓవర్సీస్ లో భారీగా వసూళ్లు తగ్గాయి. మెల్ల మెల్లగా అక్కడ పుంజుకుంటున్నట్లుగా అనిపిస్తుంది అనుకుంటున్న సమయంలో అఖండ ఓవర్సీస్ వసూళ్లు ఇండస్ట్రీ వర్గాల వారికి బూస్టింగ్‌ ను ఇచ్చింది.

ఓవర్సీస్‌ లో అత్యధిక ప్రీమియర్ గ్రాసర్‌ గా అఖండ నిలిచింది. ఏకంగా మూడు లక్షల డాలర్లకు పైగా కేవలం ప్రీమియర్ షోల ద్వారానే రాబట్టింది. ఈ ఏడాదిలో అఖంను మించి మరే సినిమా ఆ స్థాయి వసూళ్లను దక్కించుకోలేదు. మూడు లక్షల డాలర్ల వసూళ్లు రాబట్టిన అఖండ లాంగ్ రన్ లో రెండు మిలియన్‌ డాలర్ల వరకు వెళ్తుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అయినా.. ఆస్ట్రేలియా అయినా.. ఆంద్రా అయినా.. తెలంగాణ అయినా మాస్ జాతర కొనసాగుతుంది అంటూ పోస్టర్ లు చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. మూడు లక్షల డాలర్ల వసూళ్లుతో బాలయ్య ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద సరి కొత్త రికార్డును నెలకొల్పాడు అంటూ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సింహా మరియు లెజెండ్‌ చిత్రాల తర్వాత బిబి కాంబో హ్యాట్రిక్ దక్కించుకుంది అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాలయ్యను ఎలా అభిమానులు చూడాలని అనుకుంటున్నారో అలాగే ఈ సినిమా లో ఆయన్ను బోయపాటి చూపించాడు. అందుకే అభిమానులు పిచ్చెక్కి పోయేలా సినిమా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి బాలయ్య అఖండ విజయంతో టాలీవుడ్‌ కు మళ్లీ ఊపు వచ్చినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. కనుక ఈ కలెక్షన్స్ ఆ సినిమాలకు ధైర్యంను కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.