Begin typing your search above and press return to search.

లాస్ట్ హోప్ లో 'అఖండ' చిత్ర బృందం..?

By:  Tupaki Desk   |   6 May 2021 1:30 PM GMT
లాస్ట్ హోప్ లో అఖండ చిత్ర బృందం..?
X
కరోనా ఉదృతి నేపథ్యంలో సమ్మర్ లో విడుదల తేదీలని ప్రకటించిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. మే నెలలో రిలీజ్ డేట్ ని ప్రకటించిన సినిమాలన్నీ వెనక్కి తగ్గుతున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చేశారు. మే 28న రావాల్సిన రవితేజ 'ఖిలాడి' చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే అదే రోజు రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించిన నందమూరి బాలకృష్ణ ''అఖండ'' సినిమా విడుదల పై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రావడం లేదు.

బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ ''అఖండ''. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని కోవిడ్ సమయంలో కూడా షూట్ చేశారు. రిలీజ్ డేట్ కి మూడు వారాలు మాత్రమే ఉంది. మిగతా సినిమాలన్నీ వాయిదా పడుతున్న నేపథ్యంలో 'అఖండ' రిలీజ్ పై క్లారిటీ ఇవ్వాలని నందమూరి అభిమానులు కోరుతున్నారు. అయితే బోయపాటి అండ్ టీమ్ ఇంకా విడుదలపై లాస్ట్ హాప్ పెట్టుకోవడం వల్లనే రిలీజ్ డేట్ పై స్పష్టత ఇవ్వడం లేదని టాక్ వినిపిస్తోంది.

మే 15 త‌రువాత క‌రోనా ప‌రిస్థితుల్లో ఏదైనా మార్పు కనిపించి.. థియేటర్స్ యధావిధిగా నడిస్తే 'అఖండ' సినిమాను అనుకున్న తేదీకే విడుద‌ల చేయాల‌ని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్న‌ట్లుగా సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి కోవిడ్ సిచ్యుయేషన్స్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలి. కాగా, 'అఖండ' చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. బాలయ్య ఈ చిత్రంలో ఫ్యాక్షనిస్ట్ గా అఘోరాగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో ప్రగ్యా జైస్వాల్‌ - పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ నటులు శ్రీకాంత్ - జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.